చంద్రబాబు ప్రభుత్వ ఆర్ధిక తీరుపై కాగ్ కన్నెర్ర 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలను తప్పుబడుతున్న టిడిపి నేతలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు అస్తవస్తంగా ఉన్నట్లు కంఫ్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇచ్చిన నివేదిక ఇరకాటంలో పడవేస్తుంది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదికను బుధవారం ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. 
 
2017-18 ఆర్థిక సంవత్సరంలో టిడిపి అధికారంలో ఉండటం గమనార్హం. ఆ ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.16,152 కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు రూ.32,381 కోట్లు. 14వ ఆర్థిక సంఘం నిర్ధేశించిన 3 శాతం కంటే 3.25 శాతానికి పెరిగింది. కేపిటల్‌ వ్యయాన్ని ప్రజాపద్దుకు మళ్లించడం వలన రెవెన్యూ లోటును రూ.934.21 కోట్లు, ద్రవ్యలోటు రూ 5,526.09 కోట్ల మేర తక్కువగా ప్రభుత్వం చూపింది. వాస్తవానికి రెవెన్యూలోటు రూ 17,086.21 కోట్లు, ద్రవ్యలోటు రూ  37,907.09 కోట్లు. (జిఎస్‌డిపిలో 4.72 శాతం ఉండాలి).

ప్రభుత్వం చెల్లించాల్సన రుణ బకాయిలు జిఎస్‌డిపిలో 25.09 శాతం ఉండాల్సి ఉండగా 27.83 శాతం ఉందని కాగ్‌ తప్పుబట్టింది. రాష్ట్ర రుణేతర రాబడులు కనీసం ప్రాధమిక రెవెన్యూ వ్యయాన్ని భరించడానికి కూడా సరిపోవు. వనరుల సమీకరణ, వినియోగం గందరగోళంగా ఉందని కాగ్‌ ఎత్తి చూపింది. పన్నేతర రాబడి అంతకుముందు ఏడాది కంటే తగ్గింది. 

 
పెట్టుబడులపై వచ్చిన ఆదాయం 0.01 శాతం. ఇది చెల్లించాల్సన రుణాలపై సగటు వడ్డీ రేటు 6.52 శాతం చాలా తక్కువ. వేజ్‌ అండ్‌ మీన్స్‌ కింద 43 రోజులపాటు రూ 8,636 కోట్లు, ఓవర్‌ డ్రాఫ్టు 126 రోజులకు రూ 17,256 కోట్లు, స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ కింద 62 రోజుల్లోరూ  19,969 కోట్లు వినియోగించుకుంది. దానికిగాను రూ 44 కోట్లు వడ్డీ ఆర్‌బిఐకి చెల్లించింది. 
 
ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల విషయంలోనూ పరిమితి నిబంధనలను పాటించలేదు. రుణ బకాయిలు రూ 1,68,791 కోట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది కంటే 12.67 శాతం అధికం. తెచ్చిన అప్పులను పాత బకాయిల చెల్లింపుల కోసం అధికంగా వినియోగించింది. దీని వలన ఆస్తుల కల్పనకు ఆటంకం ఏర్పడింది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమలు విషయంలో ప్రభుత్వం సరైన వివరాలను వెల్లడించలేదు.