ద్రవ్యవినిమయ బిల్లు లేకుండానే ఏపీ మండలి వాయిదా 

బహుశా దేశంలో మరెక్కడా జరగని రీతిలో బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన ఏపీ శాసనమండలి సమావేశం కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును  ఆమోదించకుండానే వాయిదా పడింది. అంతకు ముందే ఈ బిల్లును ఆమోదించి శాసన సభ వాయిదా పడడంతో ఇప్పుడు ఒక విధంగా పాలనా సంక్షోభంకు దారితీసే అవకాశం ఏర్పడింది. ఎందుకంటె ఈ బిల్లు ఆమోదించనిదే జులై 1 నుండి ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. 

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని సభలో టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతుండగా, దానికంటే ముందే రాజధాని బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని వైసిపి నేతలు పట్టుబడడంతో రోజంతా సభలో వాగ్విదాల మధ్య ఎటువంటి చర్చ చేపట్టే అవకాశం లేకపోయింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు కోసం కాకుండా ఇతర బిల్లుల కోసం మంత్రి బొత్స సత్యనారాయణ పట్టుబట్టడం విస్మయం కలిగిస్తుంది. 

కనీసం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంను కూడా మండలిలో ఆమోదించలేదు. సభలో ఏ బిల్లు ముందు పెట్టాలన్న విషయంలో ఆర్ధిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, బొత్సల  మధ్య తీవ్ర  వాదోపవాదాలు జరిగాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ద్రవ్య వినిమయ బిల్లు కాబట్టి దాన్నే తీసుకోవాలని యనమల కోరగా, . కొత్త సాంప్రదాయాలు ఎందుకని బుగ్గన ప్రశ్నించారు.

ద్రవ్య వినిమయ బిల్ ముందు పెడితే మండలి వాయిదా వేసే ప్రమాదం ఉండటంతో రాజధాని బిల్లులు పెట్టాలని ప్రభుత్వం పట్టుబట్టింది.  దీంతో ఎప్పుడూ ద్రవ్య వినిమయ బిల్లును  ముందు పెట్టాలని డిమాండ్ చేసే ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి నెట్టడం చర్చకు కారణమైంది. 

సభలో ముందు రాజధాని బిల్లులు పెట్టాలని ప్రభుత్వం, ద్రవ్య వినిమయ బిల్ పెట్టాలని ప్రతిపక్షం ఒకదానికొకటి పట్టుబట్టడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది.  

తొలుత ఉదయం మాజీ మంత్రి  అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చర్చ జరగాలంటూ టిడిపి నేతలు పట్టుపట్టారు. బిసి నేతలను అణచివేసేందుకు కుట్ర పన్నారంటూ టిడిపి మండిపడింది. దీంతో అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడని, అందుకే అరెస్ట్‌ చేశామని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ స్పష్టం చేశారు.  ముద్రగడ ఉద్యమం చేస్తే మూడువేల మందితో అరెస్ట్‌ చేయలేదా అంటూ మంత్రి అనిల్‌ కుమార్ ప్రశ్నించారు. 

మంత్రుల భాషపై అంతటా చర్చ జరుగుతుందని టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. గడ్డం పెంచుకున్న వాళ్లంతా రౌడీలా అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. మీకు గడ్డం ఉందంటే మీరు రౌడీనా అని చైర్మన్‌ షరీఫ్‌ను అనిల్‌ ప్రశ్నించారు. ఇరు పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొనడంతో.. సభను చైర్మన్‌ షరీఫ్ వాయిదా వేశారు. వాయిదా పడిన అనంతరం కూడా ఇరు పక్షల నేతల మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది.