భారత్ ఎలాంటి వివాదాలను కోరుకోదని, కానీ రెచ్చగొడితే మౌనంగా ఉండబోదని సరిహద్దు వివాదంపై చైనాను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా హెచ్చరించారు. దీటుగా బదులిచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ఎలాంటి లాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని ప్రధాని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
భారత్ శాంతిని కోరుకుంటోందని ప్రధాని తెలిపారు. సరిహద్దులో చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులను స్మరిస్తూ ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల సీఎంలు మౌనం పాటించారు. భారత అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులు నివాళులర్పించారు.
‘సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువలేం. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలు. సైనికుల త్యాగాలు వృథాగా పోవని దేశానికి హామీ ఇస్తున్నా’ అని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చైనా సైనికులతో సరిహద్దుల్లో పోరాడుతూ వీర మరణం పొందిన సైనికులను చూసి దేశం ఎంతో గర్విస్తోందని మోదీ చెప్పారు. రెండోరోజూ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను స్మరిస్తూ అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
ఇలా ఉండగా, భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి.
More Stories
వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి