ఏడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 63 ఏళ్ల షహజాద్ అరెస్ట్

అతడి పేరు షహజాద్.. 63 ఏళ్ల వయసున్న కామాందుడు. తన మనవరాలి వయసున్న, అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. షికారు పేరుతో కారులో తీసుకెళ్లి పైశాచికత్వం ప్రదర్శించాడు. విషయం చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరులో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతను వినియోగించిన కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు నగరంలో 63 ఏళ్ల పి.షహజాద్‌ కారు డ్రైవరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను నివసించే ప్రాంతంలోని ఓ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో అతని కన్ను ఆ దంపతుల ఏడేళ్ల కుమార్తెపై పడింది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను బాలికని షికారు పేరుతో తన కారులో ఎక్కించుకెళ్లేవాడు. బయటకు తీసుకెళ్లాక వికృత రూపం ప్రదర్శించేవాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇలా తరచూ బాలికని కారులో తీసుకెళ్లి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో షహజాద్‌ చేస్తున్న చేష్టలను సోమవారం చిన్నారి తన తల్లికి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ యు.నాగరాజు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అతన్ని అరెస్టు చేసి అతను వినియోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.