చైనాతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న 500లకుపైగా వస్తూత్పత్తులను అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) బహిష్కరించింది. ఇందులో ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆట వస్తువులు, ఫర్నీషింగ్ ఫ్యాబ్రిక్స్, టెక్స్‌టైల్స్, బిల్డర్ హార్డ్‌వేర్, పాదరక్షలు, దుస్తులు, వంట సామాగ్రి తదితర ఉత్పత్తులున్నాయి.
‘వచ్చే ఏడాది ఆఖరుకల్లా చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వస్తువులను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర తగ్గించుకోవడమే మా లక్ష్యం’ అని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. అలాగే ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసి చైనా కంపెనీకి బదులు భారత కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
పేటీఎం, బిగ్‌బాస్కెట్ తదితర భారతీయ స్టార్టప్‌ల్లో చైనా పెట్టుబడులపై ఓ కన్నేయాలని కూడా కోరారు. హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇటీవల పెట్టిన పెట్టుబడులనూ ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు ఖండేల్వాల్ తెలిపారు. ఈ పెట్టుబడులను అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
చైనా నుంచి భారత్‌లోకి కుప్పలు తెప్పలుగా రకరకాల వస్తూత్పత్తులు వచ్చిపడుతున్నాయి. అయితే వీటిలో కొన్నింటికి భారత్‌లో ప్రత్యామ్నాయ వస్తువులుండగా, మరికొన్నింటికి చైనావే దిక్కు. ఈ క్రమంలో 3 వేల వస్తువుల దిగుమతులను ఆపవచ్చని, భారతీయ వస్తువులు వీటికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయని ఖండేల్వాల్ వెల్లడించారు.
భారత్ లో లభిస్తున్న ఉత్పత్తులను చైనా నుంచి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 40 వేల వర్తక సంఘాలు, 7 కోట్ల వర్తకులకు సీఏఐటీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. భారతీయ వాణిజ్య లోటులో 40 శాతానికిపైగా చైనాతోనే ఉన్నది. గతేడాది చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 50 బిలియన్ డాలర్లు పెరిగితే, ఆ దేశానికి భారతీయ ఎగుమతులు మాత్రం 2.5 బిలియన్ డాలర్లే పెరిగాయి.
ఇలా ఉండగా, చైనా ఉత్పత్తులకు మద్దతుగా ప్రచారం చేయవద్దని సినీ ప్రముఖులకు సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ‘చైనాతో పోరాటానికి సరిహద్దులదాకా వెళ్లాలని మేము మీకు చెప్పడం లేదు. చైనా వస్తూత్పత్తులను బహిష్కరించి సైన్యం, మాతృభూమికి అండగా ఉండాలని కోరుతున్నాం’ అని ఖండేల్వాల్ పిలుపిచ్చారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు