
`చైనా డ్రాగన్ ను ఎదుర్కొన్న భారత్ రాముడు’. గాల్వన్ లోయలో భారత్ – చైనా సేనల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి ఈ శీర్షికతో తైవాన్ లో తైవాన్ న్యూస్ వెబ్‌సైట్ వార్తను ప్రచురించింది. ‘చైనా డ్రాగన్‌ను భారత్ రాముడు ఎదుర్కొన్నాడు’ అంటూ శీర్షిక పెట్టి వ్యాసం రాసింది.
ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో అటు తైవాన్ లో, ఇటు హాంగ్ కాంగ్ లో నెటిజన్లు భారత్ ను ప్రసంసలతో ముంచెత్తుతూ, భారత్ కు సంఘీభావం తెలుపుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
ఈ ఘర్షణలో 20 భారత సైనికులు అమరులయ్యారని, 43 మంది తమ సైనికులు కూడా చనిపోయి లేదా గాయపడి ఉండొచ్చని పీఎల్‌ఏ పేర్కొన్నట్లు ఆ వ్యాసం పేర్కొంది. `తైవాన్ న్యూస్’ ప్రచురించిన రాముడు డ్రాగన్ పై బాణం ఎక్కుపెట్టిన ఈ చిత్రాన్ని హాంగ్ కాంగ్ ప్రజలు సోషల్ మీడియా లో వైరల్ చేశారు.
ఈ ఫోటోను `ఈ రోజుటి ఫోటో’ గా తైవాన్ న్యూస్ పేర్కొన్నది. ఇది భారత దేశంలో సహితం ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ” థాంక్ యు తైవాన్” (ధన్యవాదాలు తైవాన్) అంటూ భారతీయులు పెద్ద ఎత్తున స్పందించారు. హాంగ్ కాంగ్ లో భారత్ కు మద్దతుగా అనేక పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమ దేశంలో బ్రిటిష్ పాలన ఉన్న సమయంలో భారత్ వహించిన చారిత్రాత్మక పాత్రను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. 1941లో `హాంగ్ కాంగ్’ యుద్ధంలో తమ దేశాన్ని జపాన్ దురాక్రమణ నుండి భారత సైన్యం కాపాడిన విషయాన్నీ ఈ సందర్భంగా పలువురు ప్రస్తావించారు.
భారత్ పై చైనా జరుపుతున్న దురాక్రమణలలో భారత్ కు మద్దతు తెలుపుతూ తైవాన్, హాంగ్ కాంగ్ ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో స్పందించారు. ఈ సందర్భంగా `పాలు టీ కూటమి’ అంటూ పెద్ద ఎత్తున చిత్రాలు ప్రదర్శించారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆసియా దేశాల మధ్య బంధానికి సూచనగా సోషల్ మీడియాలో చాలామంది ఈ కూటమిని ప్రస్తావిస్తుంటారు. అయితే ఈ కూటమిలో బ్లాక్ టీ ఎక్కువగా సేవించే చైనాకు స్థానం లేదు. ఇక్కడ పాలు – టీ కూటమి అంటే పాలు కలిపి టీ సేవించే భారత్, తైవాన్, హాంగ్ కాంగ్ దేశాల చైనా వ్యతిరేక కూటమి అని అర్ధం.
More Stories
గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ