పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన ఫీజుల విషయంలో మైనారిటీ కాలేజీలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులను ప్రైవేటు కళాశాలలు చేర్చుకోవడం లేదని పేర్కొంటూ తోట సురేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రైవేటు కాలేజీల వ్యవహార శైలితో సుమారు 1500 మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ జి.విజయ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడం లేదని తెలిపారు. పీజీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 56పై ధర్మాసనం ఈ సందర్భంగా సందేహం లేవనెత్తింది.
డెంటల్ కోర్సుల ఫీజులకు సంబంధించి మైనారిటీ కాలేజీలను ఎందుకు మినహాయించారని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది కె.శ్రీనివాసులరెడ్డి బదులిస్తూ.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని, ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను కూడా చేర్చాలని అభ్యర్థించారు.
More Stories
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్
కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం