అరబిందోకు అంబులెన్స్‌ సేవల్లో మతలబు 

ధరను భారీగా పెంచి ‘అరబిందో’కు అంబులెన్స్ సేవలు అప్పచెప్పడంలో మతలబు ఏమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఈకాంట్రాక్టుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్‌ రెడ్డి, అరబిందో ఛైర్మన్‌ రామ్‌ప్రసాద్‌ రెడ్డి పాత్ర తేల్చాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్రాసిన లేఖలో డిమాండ్ చేశారు. 
 
అంబులెన్స్‌ సేవలను తక్కువ ధరకు ఇస్తుంటే కాదని, ధరను భారీగా పెంచి ‘అరబిందో’కు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించే ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
బీవీజీ సంస్థతో ఐదేళ్ల కాలానికి 2018లో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆ ఒప్పందం ప్రకారం నెలకు ఒక వాహనానికి ప్రభుత్వం రూ 1.31 లక్షలు చెల్లిస్తోందని గుర్తు చేశారు.

అయితే గడువు ముగియక ముందే 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు రూ 2.21 లక్షలు చెల్లించడంలో మతలబు ఏంటని నిలదీశారు. కొత్తగా కొనుగోలు చేసే వాటికి రూ 1.78 లక్షలు చెల్లించడాన్ని కూడా కన్నా ప్రశ్నించారు. తక్కువ ధరకు వస్తోన్న సేవల్ని కాదని భారీగా ధరలు పెంచి చెల్లించడంపై సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు. 

ఇలా ఉండగా, మంగళవారం అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వ బడ్జెట్ చూస్తుంటే ప్రచారం ఘనం చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని కన్నా విమర్శించారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు వైసిపి స్టిక్కర్లు వేశారని కన్నా ఎద్దేవా చేశారు. 

ఖాజానా ఖాలీ చేసి అప్పులు చేస్తూ, ఆస్తులు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనపై అవగాహన లేకకోర్ట్ మొట్టికాయలు తింటున్నారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి రివర్స్ గేర్ వేస్తున్నారని కన్నా మండిపడ్డారు.