గత మూడు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో కోతపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోవటానికి రాత్రికి రాత్రే ఆర్డినెన్సును తీసుకు రావడం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు షాక్ తగిలింది. ఈ చీకటి చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకొని, జూన్ నెల నుండి పూర్తి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని వీరి ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
లాక్‌డౌన్ ప్రభావంతో రాష్ట్ర ఆదాయం తీవ్రంగా పడిపోయిందని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులకు చెల్లించే వేతనాల్లో కోత విధించింది. అయితే పెన్షన్ లో కోత విధించడాన్ని సవాల్ చేస్తూ పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పెన్షన్లలో కోత విధించే అధికారం తమకు ఉందని హైకోర్టులో ప్రభుత్వం వాదించగా, ఏ హక్కు ఉందో చెప్పాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల చెల్లింపుల విషయమై విపత్తు యాజమాన్య చట్ట సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత రాత్రి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో పెన్షనర్లు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి కల్పించేలా ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. మార్చి 24 నుండి ఈ ఆర్డినెన్స్ అమలులోకి వచ్చినట్లు గెజిట్ లో ప్రచురించారు. చివరకు కనీస వేతనాలు, సెలవులు వంటి ఏ చట్టాలూ వర్తించని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఈ ఆర్డినెన్స్ లో ప్రభుత్వం చేర్చింది.
కాగా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లలో కోతలపై కోర్టులో సమాధానం చెప్పుకోలేక రాత్రికి రాత్రే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. కోతను ఇంకా కొనసాగించే ఉద్దేశంతోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు.
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉన్న పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల నుండి ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లింస్తుంటే, దేశంలో గుజరాత్ తర్వాత తమది సంపన్న అని చెప్పుకొంటున్న కేసీఆర్ ఉద్యోగుల జీతాలకు కొత్త విధిస్తూ ఆర్డినెన్సు తీసుకు రావడం విస్మయం కలిగిస్తుంది.
ఈ ఆర్డినెన్సు ను ఉద్యోగ వ్యతిరేక చర్య అని, ఉద్యోగులను వేధించే చర్య అని విమర్శిస్తూ దీనిని వెనుకకు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు.
More Stories
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు