శాసన ప్రక్రియలో మూడు రాజధానులు ఏర్పాటు  

 ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌   స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. పరిపాలన వికేంద్రీకరణ అనే అంశాన్ని ప్రభుత్వం కీలకంగా భావిస్తోందని చెప్పారు. 
గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గవర్నర్‌ పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
విద్యా, వైద్యం ఆరోగ్యం రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెబుతూ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామని గుర్తుచేశారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని చెప్పారు.
‘ఎన్నికల హామీలో ఇవ్వని 40 పథకాలను సైతం విజయవంతగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. దీని కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి సాధించాం. 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చారు. 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చడం జరిగింది’ అంటూ వివరించారు.  
 
జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో14 ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌, సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. 
కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని గవర్నర్ భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుందని చెబుతూ రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశామని పేర్కొంటూ  రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాట్లు చెప్పారు. రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.