ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా టెస్ట్ ఫీజ్ రూ 2,200

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ చెప్పిందని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని ఐసీఎంఆర్‌ కూడా కితాబిచ్చిందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షలకు సంబంధించి ఫీజులపై వైద్య, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.   ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా పరీక్షలకు రూ.2200 ఫీజు నిర్ణయించామని చెప్పారు.

వెంటిలేటర్‌ లేకుండా ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ.7500, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తే రోజుకు రూ.9,000గా నిర్ణయించామని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉంటే ఒకపూట దవాఖానలో ఉంటారని, పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.

కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయరని మంత్రి స్పష్టం చేశారు.  లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు తప్పకుండా హోం ఐసోలేషన్‌ పాటించాలని చెప్పారు. ఎవరైనా ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు.

ప్రతిరోజు 7500 మందికి పరీక్షలు చేసే సామర్ధ్యం ఉందని మంత్రి  ప్రకటించారు. కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్‌ సూచించిన గైడ్‌లైన్స్‌ను అమలుచేస్తున్నామని చెబుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాని భరోసా ఇచ్చారు. లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాల కన్నా పకడ్బందీగా అమలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు పరీక్షలు చేస్తారని వెల్లడించారు.

.