50 వేల మందికి ముందస్తు కరోనా పరీక్షలు 

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల కలత చెందిన ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు  రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 
 
 ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ను కాపాడుకోవడం కోసమే ఈ పరీక్షల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
నివారంనాడు అత్యధికంగా 253 కేసులు రాగా ఈరోజు 237 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో 195 కేసులుజీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. దానితో రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 4974కు చేరు కోగా,మరణాల సంఖ్య 185కు చేరుకొంది. 

 రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయి. 

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

ఈలాగు ఉండగా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ గంగాధర్‌కు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రెండు రోజులుగా మంత్రితోనే ఆయన తిరిగారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. అంతే కాకుండా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహాయకుడికి కరోనా సోకింది.