ఏపీ ఉద్యోగుల ఇతర రాష్ట్ర ప్రయాణాలు నిషేధం!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రయాణం చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

ప్రతి ఉద్యోగి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం సూచించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పిస్తేనే ఇంటి నుంచి విధులు నిర్వర్తించేందుకు అనుమతులు ఇస్తామని  తెలిపింది. అలాగే ఆరోగ్య సేతు యాప్‌లో హైరిస్క్ చూపిస్తున్న ఉద్యోగులకు ఉన్నతాధికారులు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ఉద్యోగులకు కరోనా పరీక్ష నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చిందని, ఈ నేపథ్యంలో మిగిలిన వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉద్యోగులు కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివాసముంటే డినోటిఫై చేసేంత వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా హైదరాబాద్ లో నివాసం ఉంటూ వారానికి ఐదు రోజులు అమరావతిలో పనిచేస్తూ ఉండటం తెలిసిందే.

లాక్ డౌన్ సమయంలో వారంతా అదాదాపుగా హైదరాబాద్ లో ఉండిపోయారు. పక్షం రోజుల క్రితం వారిని ప్రత్యేక బస్సు లలో అమరావతికి తీసుకు వచ్చినప్పటి నుండి సచివాలయంలో కరోనా కేసులు మొదలయ్యాయి. హైదరాబాద్ నుండి వచ్చిన వారి ద్వారానే వచ్చిన్నట్లు భావిస్తున్నారు.

మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచనల మేరకు ఏపీలో కూడా ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతి ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం పంపించిన శాంపిల్స్‌కు రూ.2400, వ్యక్తిగతంగా ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకుంటే రూ.2900 చెల్లించాలని నిర్ణయించింది.