హైదరాబాద్ లో  జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ 

ఏపీలో టీడీపీ నేతల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శంషాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అతని తనయుడు జేసీ అస్మిత్ ‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నుంచి తాడిపత్రికి వారిని తరలిస్తున్నారు. 

ఇవాళ మధ్యాహ్నం జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు జేసీ అస్మిత్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యవహారంలో జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని అస్మిత్‌రెడ్డిపై అభియోగాలు మోపారు. 

ఇక బీఎస్‌ఈ నుంచి బీఎస్‌ఈ-4గా వాహనాలు మార్చడం, నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి ఏపీకి తరలించారని ప్రభాకర్ ‌రెడ్డిపై అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. జేసి నుంచి వాహనాలు కొని మోసపోయామంటూ ఇటీవల ఆయన ఇంటి ముందు యాజమానులు నిరసన తెలిపారు. వారితో సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసినా పూర్తిగా సక్సెస్ కాలేదని రవాణాశాఖ తెలిపింది. ఒకే నకిలీ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ కొని జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అమ్మినట్లు గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు.

కాగా,  ఈ అరెస్ట్ లను ఖండిస్తూ సీఎం జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని సహించలేక అక్రమ అరెస్టులకు తెర తీశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.