శ్రీశైలం ప్రాజెక్ట్ లో పేరుకుపోతున్న పూడిక 

శ్రీశైలం జలాశయంలో ప్రతి ఏడాది పేరుకు పోతున్న పూడిక కారణంగా అందులో జల సామర్ధ్యం తగ్గిపోతున్నది. ప్రస్తుతం జలాశయం కింది భాగంలో 25 నుంచి 30 అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. దీని కారణంగా ఏడాదికి దాదాపు 1.5 టిఎంసిల చొప్పున నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. 
 
జలాశయం నిల్వ సామర్థ్యం 308 టిఎంసిలు కాగా ప్రస్తుతం 215 టిఎంసిలకు పడిపోయింది. 93 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. శ్రీశైలం జలాశయంలో పూడిక తీసేందుకు అవకాశం లేదని, పూడిక పేరుకుపోవడం వల్ల లైవ్‌ స్టోరేజీకి ఎటువంటి ప్రమాదమూ ఉండదని అధికారులు చెబుతున్నారు.

డ్యాంలోని పూడికపై ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్స్‌ రీసర్చ్‌ లాబరేటరీ పేరుతో 1976, 2006, 2011లో సర్వే నిర్వహించారు. 2011 తరువాత ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు. పూడిక పేరుకుపోవడం వల్ల డ్యాం భద్రతపై ప్రభావం చూపుతుందని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
 
 ‘పూడికలో చిన్న బాంబులు పెట్టి బురదలాగా మార్చేయడం వల్ల కొత్త నీరు వచ్చినప్పుడు బురద కొట్టుకుపోయేందుకు వీలవుతుంది. 800 అడుగుల కంటే కింద ఉన్న నీళ్లను వాడుకోవడానికి వీలుకాదు. కొత్తగా వరద వచ్చినప్పుడు నీళ్లలోని బురద కిందికి చేరి పూడిక పెరుగుతుంటుంది. వరదలు వస్తే పూడిక కొట్టుకుపోయేందుకు వీలుంటుందని’ ప్రాజక్టు చీఫ్‌ ఇంజనీర్‌ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. 
 
పూడికను తీసేందుకు డ్రెడ్జింగ్‌ వంటి ప్రక్రియలు ఉన్నాయని, అందులో బోట్ల ద్వారా పూడికను తోడవచ్చని అంటున్నారు. కానీ తీసిన పూడికను ఎక్కడ వేయాలన్నది సమస్యగా మారుతుందని, 10 వేల నుంచి 20 వేల ఎకరాల వరకూ అందుకు అవసరం ఉంటుందని, భూ సేకరణ కూడా కష్టమవుతుందని చెబుతున్నారు. 
 
తుంగభద్రలాంటి పెద్ద డ్యాముల్లో పూడిక తీయాలని అనుకుంటున్నా అది సాధ్యం కావడం లేదని, సాధారణంగా ప్రాజెక్టులు డిజైన్‌ చేసేటప్పుడే 200 నుంచి 300 ఏళ్లు పూడిక పేరుకున్నా సమస్య లేకుండా ఉండేలా డెడ్‌ స్టోరేజీని నిర్ణయిస్తారని చెబుతున్నారు. పేరుకున్న పూడికంతా డెడ్‌ స్టోరేజీలోనే ఉంటుంది కాబట్టి లైవ్‌ స్టోరేజీలో తేడా రాదని, ఎటువంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇస్తున్నారు.