కరోనా కట్టడిలో అయోమయంలో డబ్ల్యూహెచ్‌వో

కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి నుంచీ అయోమయంగానే వ్యవహరిస్తున్నది. కరోనాను మహమ్మారిగా ప్రకటించడంలో ఆలస్యం దగ్గర నుంచి లక్షణాలు బయటకు కనిపించని వారి ద్వారా వైరస్‌ వ్యాపించదన్న మొన్నటి ప్రకటన వరకు ఆ సంస్థ పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా కట్టడికి పరిశోధనలు, సూచనల అంశంలో ఏదో ఒక ప్రకటన చేయడం, తర్వాత నాలుక్కరుచుకోవడం డబ్ల్యూహెచ్‌వోకు ఇటీవల సాధారణమైంది. ఈ పరిస్థితిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనాపై పరిశోధనలు చేయగా, వాటిని సమన్వయం చేస్తూ ఇతర దేశాల్లో పరిశోధనలకు సమాచారం ఇవ్వడం డబ్ల్యూహెచ్‌వో పని. అయితే వ్యాక్సిన్‌ కోసం జరుగుతున్న పరిశోధనలను సమన్వయం చేయడంలో డబ్ల్యూహెచ్‌వో అలసత్వం ప్రదర్శిస్తున్నదనే చెప్పాలి.

కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్‌వో సూచనలే కీలకం కావలసి ఉంది. అయితే అలాంటి వాటికే శాస్త్రీయత, విశ్వసనీయత కొరవడితే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టం కాగలదు. శాస్త్రవేత్తల పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో అందించే సమాచారం చాలా అవసరం. ఈ నేపథ్యంలో  ప్రపంచవ్యాప్త పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో నాయకత్వం వహించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి సోమవారం మాట్లాడుతూ ‘లక్షణాలు బయటకు కనిపించని కరోనా బాధితుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ’ అని చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో రెండు రోజులకే ఆ మాటలను ఉపసంహరించుకొంది.

పరిశోధనల్లో సదరు వ్యక్తుల నుంచి కూడా వైరస్‌ వ్యాపించే అవకాశం 40 శాతం ఉన్నట్టు వెల్లడైంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో త న వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నది. ప్రకటనల సమయంలో  ఆధారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సంస్థలోని ప్రతినిధులే సూచిస్తున్నారు.

మార్చ్ 3న  కరోనాను మహమ్మారి అని ఇప్పుడే ప్రకటించలేమని, అందుకు తగినన్ని ఆధారాలు లేవని చెప్పి,  మార్చ్ 11 నాటికి అది మహమ్మారి అని ప్రకటించింది.  ఏప్రిల్ 7న నోటి తుంపర్లు, గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం చాలా తక్కువని చెబుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే జూన్ 5 నాటికి బహిరంగ ప్రదేశాల్లో తిరిగేప్పుడు కరోనా వైరస్‌ నుంచి రక్షణకు ఆరోగ్యవంతులు కూడా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.