తొలిసారి అమెరికా సైన్యాధిపతిగా నల్లజాతీయుడు 

అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చేతిలో చనిపోవడం పట్ల అమెరికా వ్యాప్తంగా నిరనసలు పెల్లుబుకుతున్నాయి. ఒకానొక దశలో ఆందోళనలు వైట్‌హౌజ్‌కు చేరడంతో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లజాతీయులను శాంతపరిచేందుకు స్వయానా ట్రంప్‌ కూతురు ఇవాంక రంగంలోకి దిగి తన నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో నల్లజాతీయులను ప్రసన్నం చేసుకొనేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా చరిత్రలో తొలిసారిగా సైన్యాధిపతిగా  జనరల్‌ చార్లెస్‌ క్యూ. బ్రౌన్‌ జూనియర్‌ను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్‌ (98-0 ఓట్లతో) ఏకగ్రీవంగా ఆమోదించింది.

చార్లెస్‌ బ్రౌన్‌ జూనియర్‌ ప్రస్తుతం ఫోర్‌ స్టార్‌ జనరల్‌ హోదాలో అమెరికా వైమానికదళం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు హ్యూస్టన్‌ నిర్వహించిన రోజునే బ్రౌన్‌ నియామకాన్ని అమెరికా ధ్రువీకరించడం విశేషం. ఫ్లాయిడ్‌ మరణం అమెరికాతోపాటు అనేక అంతర్జాతీయ నగరాల్లో నిరసనలకు దారితీసిన విషయం తెలిసిందే.

‘ఇవాళ అమెరికాకు చారిత్రాత్మకమైన రోజు.. దేశభక్తుడు, గొప్పనాయకుడు అయిన చార్లెస్‌ బ్రౌన్‌ జూనియర్‌తో మరింత సన్నిహితంగా పనిచేయడానికి సంతోషిస్తున్నాను’  చార్లెస్‌ బ్రౌన్‌ యామకం గురించి ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, అమెరికాలో శతాబ్దాలుగా ఉన్న జాత్యాహంకారాన్ని పరిష్కరించలేను.. వైమానికదళం సభ్యులను ప్రభావితం చేసిన దశాబ్దాల వివక్షను పరిష్కరించలేను అని బ్రౌన్‌ జూనియర్‌ ఇటీవల ట్విట్టర్‌లో వెల్లడించారు.

చార్లెస్‌ బ్రౌన్‌ జూనియర్‌ 1984 లో టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌, 1995లో ఎంబ్రి-రిడ్డిల్స్‌ ఎరోనాటికల్‌ యూనివర్సిటీ నుంచి సైన్స్‌ ప్రోగ్రాంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. అనంతరం అమెరికా వైమానిదళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.