టిడిపి నేత అచ్చెనాయుడు అరెస్ట్‌

చంద్రబాబు నాయుడు హయాంలోని పథకాలలో జరిగిన అవినీతిపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన మరుసటి రోజుననే  టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడుని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో ఆయన నివాసానికి నేటి తెల్లవారుఝామున చేరుకున్న ఎసిబి అధికారులు అచ్చెనాయుడిని అదుపులోకి తీసుకుని 100 మంది పోలీసుల భద్రత మధ్య విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. 
ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణులు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ స్కాంలో అప్పటి ఈఎస్‌ఐ‌ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌ హస్తం కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
టెండర్లు పిలవకుండా నామినేషన్‌ల పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది.
 
కొనుగోళ్ల టెండరింగ్‌లో మాజీ మంత్రి కుమారుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. రూ.988 కోట్ల మందులు, పరికరాలు, ల్యాబ్‌ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను అరెస్ట్‌ చేసిన ఎసిబి అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెనాయుడిని
ఇప్పుడు అదుపులోకి తీసుకుంది. 
 
కాగా, అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ  అసెంబ్లీకి మరో 4 రోజు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ జగన్‌ కుట్రే అని టిడిపి అధినేత ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు.