కరోనా వైరస్ కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వపు నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన వారి శవాలను వారి కుటుంబాలకు అప్పగించడంతో సహితం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దానితో పలు వివాదాలు తలెత్తుతున్నాయి.
మొన్నటికి మొన్న మధుసూదన్ అనే వ్యక్తి శవం గల్లంతయింది. రెండు, మూడు రోజుల క్రితం ఒకరికి బదులు మరొకరి శవం అప్పగించారు. తాజాగా అలాంటిదే ఒక కుటుంబానికి ఇవ్వా ల్సిన మృత దేహాన్ని మరో కుటుంబానికి అప్పగించి గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం చూపించారు.
పహాడీషరిఫ్ కు చెందిన మహబూబ్ అనే వ్యక్తి, నాంపల్లికి చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి బుధవారం గాంధీ ఆస్పత్రి లో కరోనాతో చనిపోయారు. మహబూబ్ కుటుంబ సభ్యులకు రషీద్ బాడీని గాంధీ సిబ్బంది అప్పగించారు. అయితే, మృత దేహాన్ని చెక్ చేసుకొని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఖననం చేశారు.
మరోవైపు రషీద్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం బుధవారం నుంచి వేచి చూసినా అప్పగించలేదు. తీరా చూస్తే మార్చురీలో లేదు దీంతో వివాదం రేగింది. విషయం తెలుసుకున్న డీఎంఈ కె.రమేష్ రెడ్డి గాంధీ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మార్చురీలోని ఫైళ్లను తనిఖీ చేశారు. మహబూబ్ శవం ఉండడం చూసి ఇద్దరి మృతదేహాలు తారుమారైనట్టు తేల్చారు.
గతంలో లాలాపేటకు చెందిన బహదూర్ అనే నేపాలీ దేశస్థుడు నడుస్తూ నడస్తూనే కుప్పకూలి చనిపోయాడు. టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. అతడి శవం ఏమైందో కూడా ఇప్పటికీ తెలియదు.
ఆ తర్వాత వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా, కనీసం సమాచారమూ ఇవ్వకుండా దహనం చేశారు. దీనిపై అతడి భార్య హైకోర్టును ఆశ్రయించగా ఎంత వివాదం రేగిందో తెలిసిందే.
రెండు రోజుల క్రితం బేగంపేట గురుమూర్తి నగర్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోగా, వేరే మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు ఇచ్చారు. తీరా శ్మశానవాటికకు వెళ్లిన తర్వాతగానీ వేరే వ్యక్తి మృతదేహం అని గుర్తిం చలేకపోయారు అతడి భార్య, కొడుకు దానిని తిరిగి గాంధీకి తీసుకొచ్చి అసలు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా ప్రభుత్వ పరంగా ఎటువంటి కదలిక కనిపించడం లేదు.
మరోవంక, తెలంగాణాలో గురువారం ఒక్క రోజే అత్యధికంగా 209 మందికి వైరస్ పాజిటివ్ కేసులు రావడంతో, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరింది.
More Stories
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’
నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం
జానీ మాస్టర్ పై పోక్సో కేసు