కేసీఆర్ ను కలుస్తామన్న బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ 

కరోనా టెస్టులను పెంచుతూ, కరోనా బాధితులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను పోలీసులు నేడు గృహనిర్బంధం చేశారు. 
 రాష్ట్ర మాజీ  అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ , బిజెపి శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ లను పోలీసులు  గృహనిర్బంధంలో ఉంచగా, బిజెపి శాసన మండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేసారు.
 
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు టెస్టుల సంఖ్యను పెంచడం, కరోనా బాధితులకు సదుపాయాలు కల్పించడం, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం మొదలగు అంశాలతో ‘సేవ్ హైదరాబాద్’పేరుతో సీఎం కేసీఆర్ ను కలవాలని బీజేపీ  నేతలు రెండు రోజులుగా అపాయింట్మెంట్ కోరితే సీఎం కార్యాలయం నుండి ఎటువంటి సమాధానం రాలేదు.
హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం లేదని వారు ధ్వజమెత్తారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించడం లేదని బీజేపీ నేతలు విమరసంచారు.

బిజెపి నాయకుల నిర్బంధాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండిస్తూ అరెస్ట్ లకు, ఎదురు దాడులకు బిజెపి భయపడబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని విపక్ష పార్టీల నేతలు కలవడం,  ప్రజా సమస్యలను వివరించి పరిష్కరించడానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని గుర్తు చేశారు. 

అనేక నిరసన కార్యక్రమాలతో పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని మంత్రులను కలవడం సర్వసాధారణం అని చెబుతూ సీఎం కేసీఆర్ మాత్రం ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సమస్యలను ఎత్తితే దాడి చేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.