ఏపీలో అంతుబట్టని వైరస్ మూలం

ఏపీలో కరోనా కేసుల గుర్తింపు, టెస్టులు పెరుగుతున్నా వైరస్  ఏ విధంగా వస్తుందో తెలియక తికమక పడుతున్నారు. విదేశీ ప్రయాణ నేపథ్యం లేని, వలస కూలీలు కాని, ఇంట్లో ఎవరికీ వైరస్‌ సోకని వారూ కొవిడ్‌-19 బారిన పడుతున్నారు. వీరికి ఎవరిద్వారా వైరస్‌ సోకిందో తెలియడంలేదు. దానితో సామజిక వ్యాప్తి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
పది రోజుల క్రితం కొన్ని కేసులను తీసుకుని ట్రాకింగ్‌(ట్రేస్‌) చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్ని రోజులు ట్రాకింగ్‌ చేసినా ఆ కేసులకు సంబంధించిన కాంటాక్ట్స్‌ మాత్రం దొరకడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ‌ సూచనల మేరకు, ఆరోగ్యశాఖ అధికారులు మొన్నటి వరకూ టెస్ట్‌, ట్రేస్‌, ట్రీ ట్‌ అనే విధానాన్ని అమలు చేశారు.
ఏదైనా ప్రాంతంలో ఒక వ్యక్తికి కరోనా వస్తే అతని కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా పరీక్షలు చేశారు. ఆ ట్రాకింగ్‌ ఆధారంగా అతని కాంటాక్ట్‌ ఎవరు, ఒకవేళ రెడ్‌జోన్‌ ప్రాంతంలోకి వెళ్లారా అని ఆరా తీస్తూ… ఆ వ్యక్తి 10 రోజుల హిస్టరీని సేకరించి, అతనికి కరోనా ఎలా వచ్చిందనేది నిర్ధారించేవారు.
ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చె ప్పి.. సెంటినల్‌ సర్వేలెన్స్‌ అమలు చేస్తున్నారు. అంటే… కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలకు ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తారు. షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెటింగ్‌ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సుమారు 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ముఖ్యంగా అక్కడికి నిత్యం వచ్చేవారిపై దృష్టిపెడతారు. పది మందిలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ అయితే వెంటనే ఆ ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటిస్తారు. రోజుకు 20 ప్రదేశాలను ఎంపిక చేసుకుని, సుమారు 200 మంది నుంచి శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలా మందికి లక్షణాలు కనిపించడం లేదు.

ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది! చుట్టు పక్కల ఎవరికైనా కరోనా వచ్చి, లక్షణాలు లేనివారు కూడా అనుమానంతో పరీక్షలు చేయించుకున్నా కొంత మందికే వ్యాధి బయటపడుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగుల్లో చాలామందికి పైకి లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పరిస్థితిని అత్యంత ప్రమాద స్థితిగా ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.