రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర హై కోర్ట్ ఇచ్చిన తీర్పును అమలు జరుపకుండా స్టే ఉత్తరువు కోసం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైనది. పైగా, రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలేమిటని నిలదీసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైనది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని హెచ్చరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారని నిలదీసింది. దీన్ని దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించింది. ‘‘ఆర్డినెన్సు వెనుక ఉద్దేశాలతో మేము సంతృప్తి చెందలేదు. ఇలాంటి ఆర్డినెన్సును ఎలా ఆమోదిస్తారు?’’ అని ప్రశ్నించింది.
హైకోర్టుతీర్పుపై స్టేకు నిరాకరిస్తూ.. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతామని, ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ తీర్పు జగన్ ప్రభుత్వంలో కలకలం రేపినట్లు కనిపిస్తున్నది. వరుసగా కోర్ట్ లు ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ఉండడం ప్రభుత్వ వర్గాలని కలచివేస్తుంది.
ఈ తీర్పు వస్తున్న సమయంలోనే హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేయడం గమనార్హం. న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్ రాజీనామా చేశారు. అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు న్యాయవాదుల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. న్యాయవాదులను త్వరలో నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది.
More Stories
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
చైనాలో ఏపీ, తమిళనాడు ఎంబిబిఎస్ విద్యార్థులకు జైలు శిక్ష
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!