ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై ఈ నెల 17న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హై పవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. స్టైరీన్ లీకేజీ ప్రభావం, ప్రమాదనంతర పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఇప్పటికే దఫదఫాలుగా సాంకేతిక నిపుణులతో చర్చించామని చెప్పారు.
విశాఖ జివిఎంసి సమావేశ మందిరంలో సోమవారం మీడియా ప్రతినిధులతో సమావేశమైన కమిటీ వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ ఎల్‌జి పాలిమర్స్ యాజమాన్యం బాధ్యతగా వ్యహరించలేదని, కనీస ప్రమాణాలు పాటించలేదని పేర్కొన్నారు.
పాలిమర్స్ ఘటనపై వివిధ రంగాల్లో అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో జరిగిన సమావేశాల్లో ప్రభావిత గ్రామాల్లోని కొంతమంది ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామని పేర్కొన్నారు.
నివేదిక తయారీ చేసేలోపు మరిన్ని వివరాలు, సమాచారం కోసం కొంతమంది నిపుణులతో సమావేశమవుతామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలోని లోపాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
పరిశ్రమల్లో భద్రతాంశాలపై కేంద్రీకరిస్తామని చెప్పారు. బాధిత గ్రామాల్లో నీరు, మట్టి నమూనాలను పరీక్షించడంతోపాటు మహిళల ఆరోగ్యం, పశుసంపదపై పడే ప్రభావాలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు ఏడాది పాటు కళ్లు, చర్మం, ఊపిరితిత్తులు, జీర్ణాశయం తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి