జెసి సోదరుల ట్రావెల్‌ బస్సుల సీజ్‌   

టిడిపికి చెందిన సీనియర్‌ నాయకులు జెసి దివాకర్‌ రెడ్డి, జెసి ప్రభాకర్‌ రెడ్డి సోదరులకు జగన్‌ ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. అక్రమంగా తిప్పుతున్న వారికి చెందిన ట్రావెల్‌ బస్సులను సీజ్‌ చేయాలని ఆదేశించింది.  బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన జేసీ బ్రదర్స్‌ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్‌పై 24 కేసులు నమోదు చేసినట్లు   ఆర్టిఎ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు వెళ్లడించారు. 

జటాధర ఇండిస్టీస్‌ పేరు మీద 50 వాహనాలు, సి గోపాల్‌ రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిపారు. అంతే కాకుండా కర్ణాటకలో 33, తెలంగాణలో 15, ఎపిలో 101 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని వెల్లడించారు. వీటికి సంబంధించి అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. డేటా బేస్‌లో ఈ వాహనాలను బ్లాక్‌ లిస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడ తిరుగుతున్నా ఈ వాహనాలను సీజ్‌ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినట్లు తెలిపారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులున్నాయని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ రద్దు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. 

కాగా, ఇప్పటి వరకూ జెసి ట్రావెల్స్‌ చెందిన 62 వాహనాలను సీజ్‌ చేశామని, 39 వాహనాలు సీజ్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే జెసి సోదరుల‌పై ఫోర్జరీ కేసు, ట్రావెల్‌ బస్సులకు ఇన్య్సూరెన్స్‌ అంశాలు ఉన్న విషయం తెలిసిందే..