ప్రహసంగా ఎల్‌జి పాలిమర్స్‌ లో ప్రజాభిప్రాయం     

ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఆదివారం విశాఖ జివిఎంసిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రహసంగా జరిగింది.  పోలీసు పహారా మధ్య ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతించారు. 
 
జివిఎంసిలోకి వెళ్లేదారులన్నింటినీ బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. నిపుణులు, రాజకీయ పార్టీలు, బాధితుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ప్రకటించిన అధికారులు కొందిమందికే ముఖ్యంగా అధికార పార్టీ సూచించిన వారికే అవకాశం కల్పించింది. 
 
స్టైరీన్‌ లీకేజీ ప్రమాదంలో అనారోగ్యానికి గురై చికిత్స పొంది ఇంటికి వెళ్లిన తరువాత ఆరోగ్యం మళ్లీ క్షిణించి యలమంచిలి కనకరాజు మృతి చెందాడు. మృతుల కుటుంబానికి ఇచ్చినట్లు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి పేదరికంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆయన భార్య లావణ్యకు లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఆమె ఎంత ప్రాథేయపడినా ప్రయోజనం లేకపోయింది. 
 
దీంతో, స్పృహ తప్పి పడిపోయిన ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొద్దిసేపటికి ఆమె సమీప బంధువుని లోపలకు పంపించారు. పరిహారం అందించాలని అధికారులను ఆయన కోరారు. కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పేందుకు రాజకీయ పార్టీల నుంచి ఒక్కొక్క ప్రతినిధిని ఆహ్వానించినా అనేక ఆంక్షలు విధించారు. పోలీసుల దగ్గరున్న జాబితాలోని వ్యక్తి కాకుండా అదే పార్టీ తరుఫున వేరే వ్యక్తి వచ్చినా నిరాకరించారు. 
 
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిశెట్టి సత్యనారాయణను పంపించకపోవడంతో సుందరపు విజరుకుమార్‌ సహా జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పాలిమర్స్‌ ప్రమాద బాధిత గ్రామాల నుంచి వైసిపి నాయకులు బెహరా భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఎంపిక చేసిన వారితో జాబితా తయారు చేసి లోపలకు పంపించారు. వారిలో బాధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరూ లేరు.