ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవనాలు మూసివేత 

ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవనాలు మూసివేత 

దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో పనిచేస్తున్న అధికారికి కరోనా సోకింది. ఆదివారం ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించడంతో ఎపి, తెలంగాణ భవన్‌ ల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ అధికారి కార్యాలయం, ముఖ్య ప్రాంతాలను శానిటైజ్‌ చేశారు. అనంతరం ఉమ్మడిభవన్‌ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఎపి ఆర్‌సి ఆఫీస్‌ ఆదేశాలు జారీ చేసింది. 

కరోనా సోకిన అధికారితో నేరుగా కాంటాక్ట్‌ అయిన భవన్‌ సిబ్బంది సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లాలని సూచించింది. ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి ఆరోగ్య సమస్యలూ కన్పించినా వైద్యులను ఆశ్రయించాలని పేర్కొంది. కాగా, భవన్‌ కీలక అధికారికి వైరస్‌ సోకడంతో ఎపి ఉద్యోగుల్లో ఆందోళన కన్పించింది. 

సీనియర్‌ అధికారి కావడంతో, ఎపిభవన్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పలుమార్లు ఆయనతో భేటి అయినట్టు తెలిసింది. ఎపి సిఎంఒకు చెందిన ముఖ్య అధికారి సైతం తాజాగా ఢిల్లీ పర్యటనలో కరోనా సోకిన అధికారితో సన్నిహితంగా తిరిగారని చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఆ అధికారి సైతం శనివారం తిరిగి ఎపికి బయలుదేరి వెళ్లారు. 

ఈ ఘటనతో తేరుకున్న తెలంగాణ భవన్‌ ఉన్నతాధికారులు సైతం తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి  సారించింది. ఒకే కాంప్లెక్స్‌లో ఇరు రాష్ట్రాల కార్యాలయాలు ఉన్నందున, వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని అంచనా వేసింది. దీంతో భవన్‌ సిబ్బంది రెండు రోజులు విధులకు రావద్దని ఆదేశించినట్టు భవన్‌ వర్గాలు తెలిపాయి.