గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటింటా సర్వే.. కేసీఆర్ కు హితవు 

గ్రేటర్​ హైదరాబాద్​లో ప్రమాదకర స్థాయిలో కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొంటూ  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులలో ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కు ఒక లేఖ వ్రాసారు. 

కరోనా కట్టడికి కేంద్రం జారీ చేసిన గైడ్​లైన్స్ ​కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేసీఆర్ ను కోరారు. కేసులు ఎక్కువగా ఉన్న గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో విస్తృతంగా ఇంటింటి సర్వే చేపట్టి, సకాలంలో రోగులను గుర్తించాలని ఆ లేఖలో సూచించారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నదని, అయినప్పటికీ తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

సకాలంలో రోగులను గుర్తించి, మెరుగైన చికిత్స ​ అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసారు. ఎక్కువ ముప్పు ఉన్న వృద్ధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారిని తొలిదశలో గుర్తించి చికిత్స ​ అందిచడం వల్ల మరణాలను అరికట్టవచ్చని సూచించారు.

ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజలకు ఇతర అత్యవసర వైద్యసేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. నమూనా టెస్టుల రిజల్ట్స్​ త్వరగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఆసుపత్రుల  సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్య, ఆరోగ్య  సిబ్బందికి సహాయంగా  ఉండేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. 

దేశవ్యాప్తంగా ఎక్కువగా వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని కిషన్​రెడ్డి కేసీఆర్ కు గుర్తు చేశారు. పది రాష్ట్రాల్లోని 38  జిల్లాలు, 45 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇందులో హైదరాబాద్  పేరు కూడా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. 

వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారని చెబుతూ  ఆ చర్యలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో కిషన్​రెడ్డి కోరారు. సడలింపులు ఇచ్చినా లాక్​డౌన్ స్ఫూర్తి  కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.