కరోనా సంక్షోభంలో కూడా ఫారెక్స్ నిల్వల్లో రికార్డు 

విదేశీ మారక నిల్వలు కుదించుకు పోవడంతో విదేశాలలో బంగారంను తాకట్టు పెట్టి ఒక పెద్ద ఆర్ధిక సంక్షోభం నుండి 1991లో దేశం బైట పడిన పరిస్థితుల నుండి ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఆర్ధిక వ్యవస్థ స్తంభించి పోయినా ఫారెక్స్ నిల్వలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. పైగా, రికార్డు స్థాయిలో 500 బిలియన్ డాలర్ల మార్క్ కు చేరువలో ఉన్నాము. 

గత 40 ఏళ్లలో మొదటిసారిగా జిడిపి దారుణంగా పడిపోతూ, తయారు, వాణిజ్య రంగాలు స్తంభించిపోయిన పరిస్థితులలో సహితం విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతూ ఉండడంతో మనం ఎటువంటి ఆర్ధిక సంక్షోభంనైనా  ఎదుర్కోగలమనే భరోసా కలిగిస్తున్నది. మే నెలలో ఫారెక్స్ నిల్వలు 12.8 బిలియన్ డాలర్లు పెరిగి ఎన్నడూ లేనంతగా 493.48 బిలియన్ డాలర్లకు (సుమారుగా రూ 37.30 లక్షల కోట్లు) చేరుకున్నాయి. 

1991లో 5.8 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్న ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు 8,400 శాతం పెరిగాయి. విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ లో పెట్టె పెట్టుబడులతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతూ ఉండడమే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మార్చ్ లో భారతీయ కంపెనీల నుండి విదేశీ పెట్టుబడిదారులు రుణాలు, వాటాలను రూ 60,000 కోట్లు చొప్పున ఉపసంహరించుకున్నారు. 

అయితే కోవిడ్ -19 అనంతరం రాబోయే సంవత్సరంలో భారత దేశంలో ఆర్ధిక పరిస్థితులు  ఆశాజనకంగా ఉండగలవనే నమ్మకంతో జూన్ మొదటి వారంలోనే 2.75 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేశారు. రిలయన్స్ వారి జియో లో వరుసగా రూ 97,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తుండడంతో ఫారెక్స్ నిల్వలు మరింతగా పెరిగి త్వరలోనే 500 మిలియన్ డాలర్ల మార్క్ కు చేసుకొనే అవకాశం ఉంది. 

మరోవంక ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గి మనం చెల్లింపు చేయవలసిన విదేశీ మారకద్రవ్యాన్ని భారీ స్థాయిలో ఆదా చేసుకోగలుగుతున్నాము. విదేశీ ప్రయాణాలు తగ్గడం కూడా మరో కారణం. ఏప్రిల్ లోనే 61 శాతం తగ్గి 12.87 బిలియన్ డాలర్ల మేరకు ఆదాకు దారితీసింది. ఫారెక్స్ నిల్వలు సమృద్ధిగా పేరుకోవడంతో ఆర్ధిక వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్థిరంగా విధానాలు రూపొందించుకొనే  వీలు ఏర్పడుతుంది.