కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలోని వుహాన్ నగరంలో ఇప్పటివరకు భావిస్తున్నదానికంటే ముందుగానే వైరస్ ప్రబలి ఉండొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వుహాన్‌లోని దవాఖానల వద్ద గతేడాది ఆగస్టు నుంచి వాహన రద్దీ గణనీయంగా పెరుగడాన్ని బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు.
2018, 2019లో వేసవి చివరి నుంచి శరత్కాలం వరకు ఐదు దవాఖానల ముందు వాహన రద్దీకి సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని వారు విశ్లేషించారు. వుహాన్‌లోనే అతి పెద్దదైన తియాన్యు దవాఖాన ఎదుట 2018 అక్టోబర్‌లో 171 కార్లు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. 2019లో అదే చోట అదే సమయంలో 285 వాహనాలు ఉంచినట్లు పేర్కొన్నారు. అంటే 67 శాతం వాహనాలు పెరిగినట్లు గుర్తించారు.
మరోవైపు, అదే సమయంలో చైనా సెర్చింజన్ బైదూలో కరోనా వైరస్ లక్షణాలైన దగ్గు, డయేరియాకు సంబంధించిన పదాలను ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు పరిశోధకులు తెలిపారు. దీన్ని బట్టి అప్పటికే వుహాన్‌లో ఏదో జరుగుతున్న విషయం స్పష్టమవుతున్నదని పరిశోధనకు నేతృత్వం వహించిన జాన్ బ్రౌన్‌స్టీన్ పేర్కొన్నారు.
వుహాన్‌లో కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ శాతం మంది ముందుగా డయేరియా లక్షణాలతో బాధిపడినట్లు తెలుస్తోంది. వుహాన్ హాస్పిటళ్లలో పెరిగిన రద్దీకి.. కరోనా వైరస్‌కు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని బ్రౌన్‌స్టీన్ తెలిపారు.
చైనాలో నవంబర్‌లో వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని ఇప్పటి వరకు భావిస్తున్నారు. వైరస్ గురించి డిసెంబర్ 31న చైనా ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకు సమాచారమిచ్చింది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాన్ని చైనా కొట్టివేసింది. ట్రాఫిక్ రద్దీ వంటి అంశాల ఆధారంగా ఇలాంటి నిర్ధారణకు రావడం హాస్యాస్పదంగా ఉందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ పేర్కొన్నారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
కెనడాలో వెయిటర్ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ