హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరేం కాదు

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరేం కాదు

* అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

విద్యాసంస్థలు నిర్ణయించిన డ్రెస్‌కోడ్‌ను తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చే హక్కు ఏ విద్యార్థికీ లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫాంతో పాటు అదనంగా హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. క్రమశిక్షణ, సమానత్వాన్ని కాపాడేందుకు పాఠశాలలు అమలు చేసే నియమ నిబంధనలే ఆమోద యోగ్యమని స్పష్టం చేస్తూ ఈ కీలక తీర్పును వెలువరించింది.

 
ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన మైనర్ విద్యార్థిని అదే సంస్థలో 11వ తరగతిలో ప్రవేశం పొందడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన పాఠశాల యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. 6వ తరగతి నుంచి తాను ఆ పాఠశాలలోనే చదువుకుంటూ హిజాబ్ ధరిస్తున్నానని, ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో తప్పనిసరి అని తన పిటిషన్‌లో పేర్కొంది. 
 
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ సమర్పించిన వివిధ తరగతుల ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం సదరు విద్యార్థిని మినహా అదే మతానికి చెందిన ఇతర బాలికలు ఎవరూ హిజాబ్ ధరించకపోవడాన్ని గుర్తించింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. 
 
“ఈ అంశం ఎక్కడ ఎదురైనా హిజాబ్ ధరించకపోవడం వల్ల మతం ప్రమాదంలో పడుతుందనే వాదనను, ఇది ఇస్లామిక్ విశ్వాసంలో విడదీయరాని భాగమనే అంశాన్ని వివిధ హైకోర్టులు ఏకగ్రీవంగా తోసిపుచ్చాయి” అని స్పష్టం చేసింది. హిజాబ్ మతపరమైన ప్రాథమిక ఆచారమని పిటిషన్‌లో చేసిన వాదనలకు సరైన ప్రాతిపదిక లేదని ఆగస్టు 21వ తేదీన ఇచ్చిన తీర్పులో కోర్టు వెల్లడించింది. 
 
ఏదైనా ఒక ప్రైవేట్ విద్యాసంస్థ అమలు చేసే డ్రెస్‌కోడ్ పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వర్తించినంత కాలం ఆ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసే పూర్తి అధికారాలు యాజమాన్యానికి ఉంటాయని హైకోర్టు పేర్కొంది. పాఠశాల యూనిఫాంను ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా దానికి అదనంగా మరేదైనా జోడించడానికి చట్టపరమైన హక్కు ఉండదని తేల్చిచెప్పింది.
 
అందరికీ సమానంగా వర్తించే డ్రెస్‌కోడ్‌ను ఒక్కొక్కరి అభిరుచికి అనుగుణంగా మార్చుకోవడానికి అనుమతిస్తే యూనిఫాం అనే భావనకే అర్థం లేకుండా పోతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా పాఠశాలల్లో క్రమశిక్షణను నిర్దేశించే అధికారం సంస్థ చేతి నుంచి విద్యార్థుల చేతికి మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఈ వివాదంపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ తమది స్వయంప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ సంస్థ అని, వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా తమ వద్ద చదువుకుంటున్నారని తెలిపింది. ఒక విద్యార్థికి ప్రత్యేక మినహాయింపు ఇస్తే విద్యాసంస్థ క్రమశిక్షణ, యూనిఫాం సమానత్వం దెబ్బతింటాయని వాదించింది. విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కూడా వ్యతిరేకించాయి.