సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్ జెడ్1073పై జరిగిన ఉగ్రవాద దాడిలో, తన ఒమన్ సహ-పైలట్ దాడికి గురైన తర్వాత అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ప్రాణాలను కాపాడటంలో సహాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శనివారం మాట్లాడారు. కాక్‌పిట్ లోపల జరిగిన ఘర్షణ సమయంలో ఆయన చూపిన ధైర్యాన్ని, సంయమనాన్ని ప్రశంసించారు.
ఈ సంభాషణలో, నెతన్యాహు కెప్టెన్ మచ్చర్‌ను, తన “ప్రియ మిత్రుడు” అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ తదుపరి స్వాతంత్ర్య దినోత్సవం నాడు సంబరాల జ్యోతిని వెలిగించడానికి ఆహ్వానించారు. ఆ భారత పైలట్‌ను “భారతదేశం, ఇజ్రాయెల్ ధైర్యవంతులైన ప్రజల నిజమైన హీరో” అని, “ప్రపంచం మొత్తానికి హీరో” అని అభివర్ణించారు.
“మా తదుపరి స్వాతంత్ర్య దినోత్సవం నాడు సంబరాల జ్యోతిని వెలిగించడానికి మిమ్మల్ని, నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నాను. మీరు భారతదేశం, ఇజ్రాయెల్ వీర ప్రజలకు నిజమైన హీరో, యావత్ ప్రపంచానికి హీరో. మీరు చాలా త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వారి టెలిఫోన్ సంభాషణలో పేర్కొన్నారు.
కాక్‌పిట్ లోపల జరిగిన సంఘటనను వివరిస్తూ కెప్టెన్ మచ్చర్, విమానం సాధారణంగా ప్రయాణిస్తుండగా ప్రార్థన చేయాలనుకున్న కో-పైలట్ అకస్మాత్తుగా తనపై దాడి చేశాడని చెప్పారు. “అది ఒక సాధారణ విమాన ప్రయాణం, అతను ప్రార్థన చేయాలనుకున్నాడు, అందులో అసాధారణమేమీ లేదు. అతను ప్రార్థన చేస్తుండగా, గౌరవ సూచకంగా నేను వెనుకకు కాకుండా ముందుకు చూస్తున్నాను. అకస్మాత్తుగా నా తల వెనుక భాగంలో ఒక పెద్ద దెబ్బ తగిలింది” అంటూ గుర్తుచేసుకున్నాడు.
“విమానానికి తీవ్ర నష్టం జరిగిందని, ఏదో సరిగ్గా లేదని మొదట నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అప్పుడే నాకు అర్థమైంది, అది విమానం కాదు; నాతో పాటు కాక్‌పిట్‌లో ఉన్న మరో వ్యక్తి అని,” కెప్టెన్ మచ్చర్ తెలిపారు. తొలి దెబ్బల తర్వాత తన పరిస్థితిని వివరిస్తూ, దాడి చేసిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించానని, కానీ తన దృష్టి తీవ్రంగా మసకబారిందని కెప్టెన్ మచ్చర్ చెప్పారు.
“నేను అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాను. కానీ అతను మొదట కొట్టిన దెబ్బల వల్ల నా కంటి చూపు దాదాపు పోయినట్లయింది. నా దృష్టి మసకబారిపోయింది. ఆ సమయంలో, విమానం వేగంగా కిందకు పడిపోతోందన్న భావన నాకు కలిగింది,” అని కెప్టెన్ మచ్చర్ చెప్పారు. “నాకు అప్పటి సంఘటనకు సంబంధించిన విషయాలు ఇంకా పూర్తిగా గుర్తుకు రావడం లేదు. కానీ ఆ సమయంలో జరిగిన వాటిలో నాకు గుర్తున్నది ఇదే,” అని ఆయన తెలిపారు.
కెప్టెన్ మచ్చర్ చెప్పిన వివరాలపై స్పందిస్తూ, ఆ ఘటన సమయంలో పైలట్ వ్యవహరించిన తీరుకు తాను ఆశ్చర్యపోయానని నెతన్యాహు చెప్పారు. “నిజాయితీగా చెప్పాలంటే, మీ ధైర్యసాహసాలు, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మీరు ప్రదర్శించిన సంయమనం, సమయస్ఫూర్తి నన్ను ఆశ్చర్యపరిచాయి,” అని నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ఘటనలో ఏం జరిగిందో ఇజ్రాయెల్ ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నానని చెప్పిన నెతన్యాహు, పైలట్‌ను, అతనికి సహకరించిన వారిని ప్రశంసించారు.
“ఆ తర్వాత ఏం జరిగిందో నేను ఇజ్రాయెల్ ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నాను. మీరు గొప్ప వీరుడు, మీతో పాటు మరికొందరు వీరులు కూడా ఉన్నారు, మీరంతా కలిసి ఆ పరిస్థితిని చక్కదిద్దారు. మీరు ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అంతకంటే గొప్ప విషయాన్ని కూడా మీరు కాపాడారని నేను భావిస్తున్నాను. ఎంతటి భయంకరమైన లేదా హింసాత్మకమైన దుష్టశక్తినైనా సరే, ధైర్యవంతులైన పైలట్, ప్రయాణికులు ఎదుర్కొని జయించగలరని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఆ స్ఫూర్తిని మీరు కాపాడారు” అంటూ కొనియాడారు.
“ఇది ప్రపంచవ్యాప్తంగా సముచితంగా ప్రశంసించబడుతున్న విషయం. మీరు ఇజ్రాయెల్ వీరుడు. మీరు భారతదేశ వీరుడు. మీరు ప్రపంచానికే వీరుడు. ఇక్కడి ప్రజలు మీకు సాదర స్వాగతం పలుకుతారని నేను మీకు చెప్పగలను,” అని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని కెప్టెన్ మచ్చర్ భార్యకు కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు. పైలట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
“నా తరపున, నా భార్య తరపున మీ భార్యకు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. మీకు ఒక కుటుంబం ఉందని నాకు తెలుసు. అలాగే మీరు దేశాల కుటుంబంలో ఒక భాగమని కూడా నాకు తెలుసు. మీరు దేశాల కుటుంబంలో ఒక భాగం, అందులోనూ ఒక వీరోచిత భాగం. దయచేసి త్వరగా కోలుకోండి. వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను,” అని నెతన్యాహు తెలిపారు. .

More Stories
ఆసియా క్రీడల్లో 85 పతకాలతో నాలుగో స్థానంలో భారత్
ఈ ఏడాది జిహాదీ చేతుల్లో 254 మంది హిందువుల హత్య
యుపిలో 23,000 మంది నేరస్తుల అరెస్టు, రూ. 15,233 కోట్ల ఆస్తుల జప్తు