ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్లతో దాడికి పాల్పడింది. సుమీ నగరంలోని భారత్‌కు చెందిన ‘కుసుమ్ గ్రూప్’ నడుపుతోన్న ఫార్మా ప్లాంట్‌పై జరిగిన ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రధాన భవనం చాలా వరకు ధ్వంసమైందని, మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భారతీయుడైన రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో నడుస్తున్న కుసుమ్ గ్రూప్ 1994లో దేశంలో తయారయ్యే ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమైంది. 2002 నాటికి ఇతరుల ఉత్పత్తుల పంపిణీ నిలిపివేసి, సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత తయారీ రంగానికి విస్తరించి భారత్‌లో తొలిసారి 2007లో ప్లాంట్ ప్రారంభించింది. తర్వాత 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. అనంతరం భారత్‌లో మరో రెండు తయారీ కేంద్రాలను ప్రారంభించింది.
ఈ సంస్థ 50కి పైగా జెనరిక్ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్ వంటి 9కి పైగా దేశాలలో విక్రయిస్తోంది. తమది ‘భారతీయ మూలాలు ఉన్న ఉక్రెయిన్ కంపెనీ’గా కుసుమ్ గ్రూప్ చెప్పుకుంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ సేవలు అందించిన ఈ సుమీ ప్లాంట్ తాజా దాడి వల్ల తీవ్రంగా దెబ్బతింది. ఈ దాడిలో దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఒక పోస్ట్‌లో “రష్యా దాడి”ని ఖండించారు మరియు మృతుని కుటుంబానికి, ఆత్మీయులకు సంతాపం తెలిపారు. “ఈ ఉదయం, రష్యన్లు కీవ్‌లోని పివ్నిచ్నీ వంతెనపై మరోసారి డ్రోన్‌తో దాడి చేశారు. వారు సుమీలోని ఒక సాధారణ ఔషధ గిడ్డంగిపై డ్రోన్లతో దాడి చేశారు. విషాదకరంగా, ఒక వ్యక్తి మరణించారు. మృతుని కుటుంబానికి, ఆత్మీయులకు నా సంతాపం. ద్నీప్రోలో, వారు ఒక కమ్యూనికేషన్ల కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడుల ఫలితంగా ఆరుగురు గాయపడ్డారు,” అని ఆయన తెలిపారు.
అటు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. గైడెడ్ ఏరియల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇటీవల అత్యంత వేగవంతమైన, చవకైన జెట్-పవర్డ్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన ‘షాహీద్’ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన దాదాపు 250 కిలోమీటర్ల పరిధి కలిగిన ‘ఎఫ్ పి-7’ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఈ వారంలోనే మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించినట్లు ప్రకటించింది.
More Stories
ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవంకు కెప్టెన్ మచ్ఛర్ కు ఆహ్వానం
ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్‌ను కలిసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
అమెరికాలోని ఓహియోలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి