రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ వేధింపులే ప్రధాన కారణమని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. ఈ కేసులో సాదిక్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఖాన్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.
నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్‌ల ఆధారంగానే దర్యాప్తును ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ఎస్పీ మీడియాకు వివరించారు.
“నూకరాజు రాసిన ఆత్మహత్య లేఖ ఆధారంగా ముందుగా కేసు నమోదు చేశాం. ఆ తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య స్కూటీలో మరో లేఖ దొరికింది. ఈ రెండు లేఖల్లోనూ సాదిక్ ఖాన్ గురించే రాశారు. అతని వేధింపుల వల్లే చనిపోతున్నట్లు ఆ లేఖల్లో స్పష్టంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి తిరుగుతున్న లేఖల గురించి మేం ఏమీ చెప్పలేం. మా దగ్గర ఉన్న పక్కా ఆధారాల మేరకు ఛార్జ్‌షీట్ వేస్తాం” అని ఎస్పీ తెలిపారు.
“నిందితుడు సాదిక్ ఖాన్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా ఎత్తులు వేశాడు. ట్రేస్ చేయకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లు వాడలేదు. అతన్ని పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించాం. ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించాం. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సాదిక్‌ఖాన్‌ను అరెస్ట్ చేశాం. అతన్ని పట్టుకునేందుకు మా బృందాలు చాలా కష్టపడ్డాయి” అని ఎస్పీ బిందుమాధవ్ వివరించారు.
సాధిక్ ఖాన్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. మరోవైపు సాధిక్ ఖాన్‌ను వారం రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడిని ఏఎస్పీ, ఐదుగురు సీఐలతో కూడిన బృందం ప్రశ్నించింది.
ఇలాంటి సున్నితమైన విషయాల్లో బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. ఆత్మహత్యకు ముందు నూకరాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంటూ ఎవరైనా వేధింపుల బారిన పడినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా సాయం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సున్నితమైన ఘటనల్లో ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
కాగా, వైఎసార్సిపి కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ `లవ్ జిహాదీ’ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబంకు న్యాయం చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నదని పేర్కొంటూ షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలని, ఇతనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర డిజిపి, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలని కోరారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవిందు, జిల్లా ఉపాధ్యక్షుడు హేమంత్ జైన్, జిల్లా సీనియర్ నాయకులూ వాసా పల్లపు రాజు తదితరులు ఆ మేరకు అదనపు డిసిపికి వినతిపత్రం సమర్పించారు. రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డిని తరచూ శిక్షణకు తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని తెలిపారు.
కొన్ని కోట్ల రూపాయల నగదు, బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేశాడని ఆరోపించారు. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని వత్తిడులు చేస్తూ, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులని పాల్పడ్డాడని వివరించారు.
ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెందిన నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కానీ మనవడు కార్తికేయ (12)కి ఈత రావడంతో బతికాడని, ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు.

More Stories
పండుగల ముందు వేడి పుట్టిస్తున్న ఉల్లిపాయ, చక్కెర ధరలు
`ఒకే దేశం, ఒకే ఎన్నిక’కు 99 శాతం మంది మద్దతు
రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం ప్రైవేటు కంపెనీలకే!