గాంధీలో నిర్లక్ష్యంతోనే జర్నలిస్ట్ మనోజ్ మృతి!

కరోనా కారణంగా ఆదివారం టివి 5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ మృతి చెందడానికి గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ప్రదర్శించిన నేరమయ నిర్లక్ష్యమే కారణమని కలకలం రేపుతున్నది. పైగా, గాంధీలో కరోనా రోజులకు అవసరమైన ప్రాధమిక వసతులు కూడా లేవని వెల్లడవుతుంది. 
 
దానితో “అది గాంధీ హాస్పిటల్ కాదు, గాంధీ స్మశానవాటిక” అనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  చనిపోవడానికి ముందు మనోజ్ చేసిన చాటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది కోవిడ్ రోగులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూలో కూడా పరిస్థితులు సరిగా లేవని వాపోయారు. 
 
గాంధీ ఆస్పత్రితో దుస్థితిని వీడియోలతో సహా బయటపెట్టారు. గాంధీలో ఆక్సిజన్ పెట్టడం లేదని, తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కోరతూ తన సన్నిహితులతో చాట్ చేశారు. మనోజ్ చేసిన చాటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ మేసేజ్‌తో గాంధీ ఆస్పత్రిలో ఉన్న డొల్లతనం బహిర్గమైంది. 
 
అక్కడ రోగుల రోగనిరోధక శక్తీ పెంచే విధంగా ఆహరం లేదని, తీసుకొచ్చి మంచంపై పడవేయడమే గాని తమను పట్టించుకోవడం లేదని వాపోయాడు. అన్నతో కలసి అక్కడ చేరడానికి వస్తే పడకలు ఖాళీగా లేవంటూ రెండు గంటలకు పైగా చేర్చుకోలేదు. ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఫోన్ చేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని  మిత్రులతో  వాపోయాడు.