కేజ్రీవాల్ నిర్ణయంపై కేంద్ర జోక్యం కోరిన మాయావతి 

కేజ్రీవాల్ నిర్ణయంపై కేంద్ర జోక్యం కోరిన మాయావతి 
కరోనా కల్లోలం నేపథ్యంలో ఢిల్లీలోని ఆస్పత్రులను కేవలం స్థానికులకే కేటాయించాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్ నిర్ణయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  
‘దేశానికి ఢిల్లీ రాజధాని. ముఖ్యమైన పనుల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారు ఢిల్లీవాసులు కాదన్న కారణంతో చికిత్స చేసేందుకు నిరాకరించడం సరైంది కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల’ని కోరుతూ మాయావతి ట్వీట్‌ చేశారు.
లాక్‌డౌన్‌ను సడలించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కాగా, ఢిల్లీలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదని, 90 శాతం పడకలు స్థానికులకే కేటాయించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రయివేటు ఆస్పత్రులు సహా ఢిల్లీలోని ఆస్పత్రులన్నీ స్థానికులకు మాత్రమే వైద్యం అందించాలంటూ నిన్న కేజ్రీవాల్ ఆదేశాలు జారీచేశారు. 
 
అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆస్పత్రులకు ఈ ఆదేశాలు వర్తించవనీ.. వాటిలో అన్ని రాష్ట్రాల ప్రజలు వైద్య సేవలు అందుకోవచ్చునని సీఎం ప్రకటించారు. 
 
మరోవంక, కేజ్రీవాల్ సర్కారు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా ఆక్షేపించారు. ‘కేజ్రీవాల్ జీ పేరులో ‘వాల్ (ఎల్)’ ఉంది. అందుకని ఆయన దాన్ని నిర్మిస్తారా? అలాంటి వివక్ష ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ  సీఎం చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.
ఢిల్లీయేతరులకు చికిత్స నిరాకరించడం సిగ్గుచేటని హస్తిన బీజేపీ నాయకుడు మనోజ్‌ తివారి అంతకు ముందు విమర్శించారు. కేజ్రీవాల్‌ పాలనలో ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిస్సహాయంగా మారిందని దుయ్యబట్టారు.