తెలంగాణలో పరీక్షలు లేకుండానే టెన్త్ పాస్ 

తెలంగాణలో పరీక్షలు లేకుండానే టెన్త్ పాస్ 
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్దు చేస్తూ, ఎటువంటి పరిక్షలు  లేకుండానే విద్యార్థులంద‌రినీ ప్ర‌మోట్ చేయాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకుకున్నారు.

దేశంలో, రాష్ట్రంలో క‌రోనా ప్ర‌బ‌లుతున్న తీరు నేప‌థ్యంలో పదో తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి కేసీఆర్ జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదని నిర్ధారణకు వచ్చారు. దానితో  ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఈ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వాల‌ని ఆదేశించారు.రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి.

ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహాయించి మిగిలిన తెలంగాణలో పరీక్షలు జరుపవచ్చని గత వారం హై కోర్ట్ తీర్పు ఇచ్చినా, ఆ విధంగా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

పైగా, కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్ధులకు కరోనా సోకితే బాధ్యులెవరని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకునే కన్నా విద్యార్ధులను ప్రమోట్ చేయడం ఉత్తమమని నిర్ణయానికి వచ్చింది. కాగా, డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.