పెట్రోలు, డీజిల్ కొరతతో అల్లాడుతున్న పాక్

పాకిస్థాన్ లోని అనేక నగరాలు తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.

పాకిస్థాన్ వార్తాపత్రికల కథనం ప్రకారం బెలోచిస్థాన్ లోని పంపు స్టేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. క్వెట్టాలో పెట్రోలు బంకుల వద్ద భారీగా బారులు తీరిన వాహనాలు కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు మూడు నాలుగు రెట్లు పెరిగాయి. సరఫరా కొరతతో ధరలు పెరుగుతున్నాయని కరాచీ పెట్రోల్ పంపు ఓనర్లు చెబుతున్నారు. 

తమకు బెదిరింపులు వస్తున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే బంకులు మూసివేయడం తప్ప వేరే దారి లేదని చెబుతున్నారు. లాహోర్, పెషావర్, కరాచీ, క్వెట్టా ప్రాంతాల్లో బంకులు మూసివేతకు సిద్ధమౌతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఇంధన నిల్వలు ఈ వారాంతంతో అయిపోతాయని, ఆదివారం నాటికి పరిస్థితి అధ్వాన్నమౌతుందని ఆల్‌ పాకిస్థాన్ పెట్రోలియం రీటైలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పాక్ ప్రభుత్వం విరుచుకు పడుతోంది. 

అక్రమ లాభాల కోసం ఆయా కంపెనీలు ఇదంతా చేస్తున్నారని, ఇదే కొనసాగితే ఆయా కంపెనీల లైసెన్సులు రద్దు చేస్తామని పాక్ విద్యుత్, పెట్రోలియం మంత్రి ఒమర్ ఆయూబ్‌ఖాన్ హెచ్చరించారు.