ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖపట్టణంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై చంద్రమౌళి మృతదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కశ్మీర్‌ సందర్శనకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని ఆయన నివాసం వద్ద భౌతికకాయానికి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కన్నీటితో నివాళులు అర్పించారు. హోం మంత్రి అనిత, మంత్రి సత్యకుమార్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు, అధికారులు చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులు అర్పించి అంజలి ఘటించారు.

చంద్రమౌళితోపాటు కశ్మీర్ పర్యటనకు వెళ్లినవారు అక్కడి ముష్కరుల పాశవిక చర్యలను మంత్రులకు వివరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రమౌళి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మంత్రి సత్యకుమార్‌, ఎంపీ రమేశ్‌ చంద్రమౌళి పాడెను మోశారు. ఆయన కుటుంబసభ్యులు, ఆత్మీయులు విలపించిన తీరు అక్కడివారి గుండెలను పిండేసింది.

చంద్రమౌళి చాలా ఆత్మీయుడని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యలను పార్టీలు, కుల, మతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.

“వైజాగ్ వాసి అయిన చంద్రమౌళి అందరికీ అత్యంత ఆత్మీయుడు. అందరికీ ఏదైనా హెల్ప్ చేయాలి అనుకునే వ్యక్తి. ఘటన గురించి తనతో పాటు వెళ్లిన వారు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి కచ్చితంగా ప్రతిచర్య అనేది ఉంటుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది” అని హోంమంత్రి అనిత తెలిపారు.