తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. ఈ విషయంలో మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ విచారణను ప్రారంభించనుంది.
ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. భూదేవి కాంప్లెక్స్ వద్దకు వెళ్లనున్నారు. అక్కడ పాత ఎస్వీబీసీ ఆఫీసును తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించనున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై విచారణ జరిపి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని దినేష్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలనా వైఫల్యాలపై ఏకసభ్య కమిషన్ విచారణ జరపనుంది. 2021- 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిపై ఏకసభ్య కమిషన్ విచారణ జరపనుంది. నెయ్యి సరఫరాలో టెండర్ నిబంధనల సడలింపు కారణాలపైనా విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు సిట్ నివేదిక అంశాలను సైతం ఏకసభ్య కమిషన్ పరిగణనలోకి తీసుకోనుంది.
మొత్తం అన్ని అంశాలపైనా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కాగా, ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఓవర్ లాపింగ్ కిందకు రాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపింది.

More Stories
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాంప్రదాయ గిరిజన వంటకాలతో మిల్లెట్ మీల్ ‘అరకు కౌని’
గుంటూరుకు చెందిన పద్మకు “ఇండియా ఆర్ట్స్–2026” అవార్డు