ఎన్నికల బాండ్ల రద్దులో మళ్లీ నల్లధనం

ఎన్నికల బాండ్ల రద్దులో మళ్లీ నల్లధనం

న్నికల బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కంపెనీలను ఈడీ, సీబీఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇప్పించుకున్నారనే ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకు 400 సీట్లు లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకొని ఉందని, అటువంటప్పుడు, ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారే ఓ సుప్రీం లీడర్‌ ఆవిర్భవించే పరిస్థితే తలెత్తదని స్పష్టం చేశారు. 

సోమవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఎడిటర్‌ స్మితా ప్రకాశ్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ 400 సీట్లు గెలిస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్షాలు కుటిలంగా ఆలోచించి దాన్ని దేశంలో చలామణి చేయాలని అనుకుంటున్నాయని ధ్వజమెత్తారు.

ఎన్నికల బాండ్ల వల్ల నిధులు పారదర్శకంగా ఏయే పార్టీలకు అందాయో స్పష్టంగా తెలుస్తుందని, ఎన్నికల బాండ్లు లేకపోతే ఆ పరిస్థితి ఉండదని.. మళ్లీ దేశాన్ని నల్లధనం వైపు తీసుకెళ్లామని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరికి వెళ్లాయో తెలిసే పరిస్థితే ఉండదని, దీనివల్ల అందరూ బాధపడే రోజు వస్తుందని తెలిపారు. 

కార్పొరేట్‌ కంపెనీలను ఈడీ, సీబీఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇచ్చేలా చేశారన్న ఆరోపణలను మోదీ ఖండించారు. మొత్తం 3 వేల కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్లు కొంటే, వాటిలో 26 కంపెనీల మీద మాత్రమే దర్యాప్తు జరిగిందని, సదరు సంస్థలు ఇచ్చిన విరాళాల్లో 37 శాతం మాత్రమే బీజేపీకి వచ్చాయని, 63 శాతం బీజేపీయేతర పార్టీలకు వెళ్లాయని చెప్పారు.

 కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ స్పందిస్తూ అది దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిగా దిగజారస్తుందని విమర్శించారు. తొలిసారి ఓటు వేసే యువతీ యువకుల ఆకాంక్షలను అది పూర్తిగా ధ్వంసం చేస్తుందని, 25 ఏళ్లలోపు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ప్రధాని తెలిపారు. 

తన హయాంలో యువత జీవితాలు మెరుగుపడ్డాయని, ఆర్థికంగా నష్టం వస్తున్నా డేటాను తక్కువ ధరకు అందిస్తున్నామని, దీనివల్ల దేశంలో యువత డిజిటల్‌ విప్లవం తీసుకొస్తోందని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్ల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఈడీ, సీబీఐ దుర్వినియోగం అబద్ధం

ఈడీ, సీబీఐ వంటి సంస్థలు బీజేపీ చెప్పినట్లు పని చేస్తున్నాయని, ఈవీఎంలను కూడా దుర్వినియోగపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను మోదీ కొట్టివేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటమికి ప్రతిపక్షాలు ఈ విధంగా కారణాలను వెతుక్కుంటున్నాయని ఎద్దేవా చేశారు. 

ఈడీ, సీబీఐకి సంబంధించిన ఏ చట్టాలనూ తమ ప్రభుత్వం చేయలేదని, అవన్నీ కాంగ్రెస్‌ హయాంలో రూపొందించినవేనని చెప్పారు. ఈడీ పెట్టిన కేసుల్లో 3 శాతం మాత్రమే రాజకీయ నేతలపై నమోదయ్యాయని, మిగిలిన 97 శాతం కేసులు రాజకీయాలకు సంబంధించని వారి మీద ఉన్నాయని స్పష్టం చేశారు. 2014కి ముందు ఈడీ రూ.34 కోట్ల నగదును మాత్రమే స్వాధీనం చేసుకుందని, గత పదేళ్లలో ఈ మొత్తం రూ.2,200 కోట్లకు పెరగిందని చెప్పారు. 

గతంలో ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్ల నియామకాలు పూర్తిగా ప్రధానమంత్రి విచక్షణ మేరకు జరిగేవని, దానిని మార్చి ప్రతిపక్షానికి కూడా తాము చోటు కల్పించామని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో నియమించిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీ అధినేతల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఉదంతాలు ఉన్నాయని, కొందరు కమిషనర్లకు పదవీకాలం పూర్తయిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా పదవులు కూడా ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. బీజేపీ ఆ స్థాయికి దిగజారదని చెప్పారు. 

‘2024 ఎన్నికల రూపంలో దేశ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. 50- 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ నమూనా ప్రభుత్వం ఉంది. మరోవైపు, నా పదేళ్ల పాలన ఉంది. (నా హయాంలో) తప్పులు జరిగి ఉండవచ్చు. కానీ, ప్రయత్న లోపం మాత్రం లేదు. అన్ని రంగాల్లో ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసి ఓటేయండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు.