* భారత్ లో 25 రోజుల చమురు నిల్వలు
ఎట్టకేలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. దీంతో అక్కడి నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ నుంచి న్యూడిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ గత 24 గంటల్లో భారత్‌లోకి ప్రవేశించిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ఇదే. ఇక యూఏఈలో ఇరుక్కుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబయి, కొచ్చిలకు నాలుగు ప్రత్యేక విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది. యూఏఈ నుంచి భారత్‌కు పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభమైన విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ శాఖకు చెందిన ప్రవాస భారతీయుల తరలింపు విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 2వ తేదీ సాయంత్రం నుంచి యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయని తెలిపింది. దుబాయ్‌లోని ఈ రెండు ఎయిర్‌పోర్టులను పూర్తిగా మూసివేయలేదని, కానీ వాటిలోకి ప్రవేశించే ప్రయాణికులను కఠినంగా స్క్రీనింగ్ చేస్తున్నారని విదేశాంగ శాఖ చెప్పింది.
స్పైస్ జెట్ కూడా యూఏఈకి విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మార్చి 4 నుంచి కొన్నిరోజుల పాటు యూఏఈలోని ఫుజైరా నుంచి భారత్‌కు నాలుగు ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతామని వెల్లడించింది.
ఇలాఉండగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారతదేశంలో 25 రోజుల ముడి చమురు, శుద్ధి చేసిన చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు ధరలు తీవ్రంగా పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే తక్షణ ప్రణాళికలు లేవని కూడా వర్గాలు తెలిపాయి.

More Stories
నారీ శక్తి: రాష్ట్ర సేవికా సమితి కథ
జేడీయూలోకి నితీష్ తనయుడు నిశాంత్
గల్ఫ్ నుండి వారం రోజుల్లో 52,000 మంది చేరవేత