మేడారంలో 2024లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘ శుద్ద పౌర్ణమి గడియలను ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారని తెలిపారు.
ఫిబ్రవరి 22 గురువారం చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 23న వన దేవతలకు మొక్కులు చెల్లింపులు, ఫిబ్రవరి 24న తల్లుల ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. 2018లో జరిగిన జాతరకు సంబంధించి తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించామని, కానీ అనివార్య కారణాల రీత్యా 2024 జాతర తేదీలను 9 నెలల ముందుగానే ప్రకటించే అనివార్యత ఏర్పడిందని పేర్కొన్నారు.
వనదేవతలకు జీవితకాలం సేవ చేస్తున్న మేడారం పూజారులకు దేవాదాయశాఖ వెంటనే అర్చకభవన్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రోజంతా వనదేవతల సన్నిధిలో గడిపే పూజారులకు, వారి దైనందిన కార్యక్రమాలకు ఒక కార్యాలయం అవసరమని తెలిపారు.
తమ పూర్వికుల నుండి తరతరాలుగా తల్లులకు సేవ చేస్తున్న తమకు హక్కులుంటాయని, వాటిని ప్రభుత్వం గుర్తించి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో బాసిల్లుతున్న దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారంలో భక్తులకు సౌకర్యార్థం స్థానికంగా ఆలయ అధికారులు, ఉద్యోగులు ఉండేలా దేవాదాయశాఖ సత్వరమే చర్యలు చేపట్టాలని పూజారుల సంఘం డిమాండ్ చేసింది.
అలాగే రాష్ట్రంలోని అతి పెద్ద జాతరకు ప్రభుత్వం జనరల్ ఫండ్ నుండి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ముందే వసతుల ఏర్పాట్లు చేయాలని, రూ. 200కోట్ల నుండి తగ్గిస్తూ రూ. 70కోట్లకు తెచ్చిన మహాజాతర బడ్జెట్ను పునరుద్దరించాలని జగ్గారావు ప్రభుత్వాన్ని కోరారు.

More Stories
నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం
తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు
ఎంఐఎం ఎమ్యెల్యేల సభ్యతాలు రద్దుచేయమని బీజేపీ డిమాండ్