32 కేజీల బంగారం, 1518 కేజీల వెండి.. అయోధ్యలో కానుక‌ల‌న్నీ సుర‌క్షితం

32 కేజీల బంగారం, 1518 కేజీల వెండి.. అయోధ్యలో కానుక‌ల‌న్నీ సుర‌క్షితం

త‌మ ట్ర‌స్టు ఆధీనంలో సుమారు 30 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న‌ట్లు తె శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు మంగళవారం ప్రకటించింది. సుమారు 1518 కేజీల వెండి వ‌స్తువులు ఉన్న‌ట్లు ఆ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద దేవ్ గిరి తెలిపారు. అయోధ్య రామాల‌యంలో విరాళాల‌ను చోరీ చేసిన ఘ‌ట‌న‌లో 8 మంది అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. 

ఆ కేసులో ఇంకా ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ది. అయితే భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాల‌ను చోరీ చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స్పందించింది. దేవాల‌యానికి ఇప్ప‌టి వ‌ర‌కు 2926 విలువైన వ‌స్తువుల‌ను కానుక‌లుగా స‌మ‌ర్పించార‌ని, అవ‌న్నీ సుర‌క్షితంగా ఉన్నాయ‌ని, వాటికి సంబంధించిన రికార్డుల‌ను కూడా నిర్వహిస్తున్నామని ఆయ‌న చెప్పారు.

బంగారంతో త‌యారు చేసిన రామ‌చ‌రిత‌మాన‌స్‌, డైమండ్ నెక్లెస్ కూడా అదృశ్య‌మైన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ట్ర‌స్టు కొట్టిపారేసింది. ఆ కానుక‌ల‌ను మీడియా ముందు ప్ర‌ద‌ర్శించింది. స్వామివారికి చెందిన వెండి చ‌ర‌ణ పాదుక‌లు, కాక‌బుషుండి క‌ళాకృతి మిస్సైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్త‌ల‌ను ట్ర‌స్టు కొట్టిపారేసింది. ఆ కానుక‌ల‌ను కూడా మీడియా ముందు ట్ర‌స్టు ప్ర‌ద‌ర్శించింది. 

ప్ర‌తి వ‌స్తువు వివ‌రాల‌ను ఇన్వెంట‌రీలో పొందుప‌రిచామ‌ని, ఆ వ‌స్తువును విరాళం ఇచ్చిన దాత పేరు కూడా త‌మ వ‌ద్ద ఉన్న‌ట్లు గిరి తెలిపారు. వెండి కాక‌బుషుండి వ‌స్తువు ఆల‌య ఆధీనంలో ఉన్న‌ట్లు గిరి చెప్పారు. 2024 మార్చి 31వ తేదీ వ‌ర‌కు రామ‌మందిరానికి సుమారు 16.765 కిలోల బంగారు వ‌స్తువులు కానుక‌లుగా వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఇక 2024-25లో 10.445 కిలోల బంగారం, 2025-26లో 5.050 కిలోల బంగారం కానుక‌ల రూపంలో వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. 2026 మార్చి 31వ తేదీ వ‌ర‌కు ఆల‌యానికి మొత్తం 32. 259 కిలోల బంగారం అందిన‌ట్లు గిరి వెల్ల‌డించారు. వెండి వ‌స్తువుల‌ను క‌రిగించిన త‌ర్వాత ఆల‌యం వ‌ద్ద మొత్తం 849 కేజీల రిఫైన్డ్ సిల్వ‌ర్‌ ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ఇక ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు మొత్తం 1518 కిలోల వెండి ఆల‌యం వ‌ద్ద ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌తి ఏడాది చార్టెడ్ అకౌంట్‌తో ఆ వ‌స్తువుల‌ను వెరిఫై చేయిస్తున్న‌ట్లు గిరి తెలిపారు.

 “అత్యున్నత నాణ్యత కలిగిన ఇతర కానుకలు, విరాళంగా వచ్చిన వస్తువులు కూడా ఆచూకీ లేకుండా మాయమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి వివరాలు ఉన్న రిజిస్టర్‌ను మీకు చూపించడానికి మేము తీసుకువచ్చాము. సంబంధిత వస్తువుల వివరాలన్నింటినీ మేము మీ ముందు ఉంచుతున్నాము. ఈ రోజు వాటన్నింటినీ మేము మీకు ప్రదర్శించుతున్నాము,” అని ఆయన వివరించారు. 

తమ కానుకల వినియోగాన్ని సరిచూసుకోవాలనుకునే లేదా వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకునే భక్తులు, ట్రస్ట్ అధికారి వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత అయోధ్యను సందర్శించాలని ఆయన కోరారు.