చైనా కట్టడికి ఇండోనేసియా చేతికి భారత బ్రహ్మాస్త్రం

చైనా కట్టడికి ఇండోనేసియా చేతికి భారత బ్రహ్మాస్త్రం
* మోదీకి అత్యున్న‌త పుర‌స్కారంతో ఇండోనేసియా సత్కారం 
ఆపరేషన్ సింధూర్‌ ద్వారా బ్రహ్మోస్ క్షీపణుల సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలు చూశాయి. దీంతో భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. చైనాతో చిక్కులు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇప్పటికే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది.  తాజాగా ఇండోనేసియా సైతం భారత బ్రహ్మా్స్త్రంగా పేరొందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. 
 
చైనా జలాంతర్గామి నుంచి ఫసిపిక్ సముద్ర జలాల్లోకి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల వ్యవధిలోనే భారత్, ఇండోనేసియా మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.  బ్రహ్మోస్, అస్త్ర మిస్సైళ్ల సరఫరాతోపాటు అరుదైన ఖనిజాల విషయంలో సహకారంపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
 
అస్త్ర మిస్సైళ్లను భారత్ స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. ఫిలిప్ఫిన్స్‌లాగే ఇండోనేసియా సైతం చైనా నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇండోనేసియా పరిధిలోని నతునా దీవుల పరిధిలోకి చైనా నౌకలు చొరబడుతున్నాయి.  దీంతో బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు తన దగ్గర ఉంటే చైనా ఆ సాహసం చేయదని ఇండోనేసియా భావిస్తోంది. అందుకే భారత్ దగ్గర్నుంచి వాటిని పొందేందుకు ఒప్పందం చేసుకుంది. మరో వైపు వియత్నాం కూడా బ్రహ్మోస్ క్షీపణుల కోసం భారత్ తో చర్చలు జరుపుతుంది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య జకార్తాలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో  ఇండోనేషియా సైన్యానికి భారత్‌ అత్యాధునిక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సరఫరా చేయడంతో పాటు సముద్ర భద్రత, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సమావేశం అనంతరం ఇరు దేశాలు దాదాపు 20 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
ఉమ్మడిగా సబాంగ్ ఓడరేవు అభివృద్ధి 
ఈ పర్యటన ద్వారా ఆశించబడుతున్న ప్రధాన ఫలితాలలో ఒకటి, భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఇండోనేషియాలోని సబాంగ్ ఓడరేవును సంయుక్తంగా అభివృద్ధి చేసే ఒప్పందం. సబాంగ్ ఓడరేవు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గ కూడలి అయిన ‘మలక్కా జలసంధి’కి సమీపంలో ఉంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 22 శాతం, సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో దాదాపు 29 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది.
అంతేకాకుండా, ఈ ఓడరేవు భారత్‌కు చెందిన ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’కు కేవలం 100 మైళ్ల దూరంలో ఉంది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగానికి అవసరమైన ఉక్కు, నికెల్‌, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ఇండోనేషియా కీలక దేశంగా ఉంది.  ఈ నేపథ్యంలో అక్కడ ఉక్కు, నికెల్‌, రేర్‌ ఎర్త్‌ శాశ్వత అయస్కాంతాల తయారీ రంగాల్లో భారత్‌ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల భారత పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరా మరింత బలపడనుంది.
మరోవంక, చైనా కట్టడికి ఇండోనేసియా చేతికి భారత బ్రహ్మాస్త్రం  భారతదేశ సహకారంతో ఇండోనేషియాకు ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని (ఈవీఎం) అభివృద్ధి చేయడం ద్వారా, భారత్ ఎన్నికల నిర్వహణ సాంకేతికతను స్వీకరించడానికి ఇండోనేషియా సిద్ధమవుతోంది. ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీని వల్ల వ్యాపార లావాదేవీలు, పర్యాటకుల చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి.
అలాగే ఇండోనేషియాలో భారతీయ నిర్వహణ విద్యాసంస్థ ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కాగా, ఇండోనేషియా ప్ర‌భుత్వం ఆయ‌న్ను అత్యున్న‌త పుర‌స్కారం బిన్‌టాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో మోదీని స‌న్మానించింది. ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటో ఆ మెడ‌ల్‌ను అంద‌జేశారు. ఈ గౌర‌వం కోట్లాది మంది భార‌తీయుల‌కు చెందుతుంద‌ని మోదీ పేర్కొన్నారు. ఈ సత్కారం ఇండోనేషియా ప్ర‌జ‌ల భావోద్వేగాల‌కు చెందుతుంద‌ని తెలిపారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, శ్రేయ‌స్సు కోసం పాటుప‌డే వ్య‌క్తుల‌ను ఇండోనేషియా స‌ర్కారు బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో స‌త్క‌రిస్తుంది.