ఈ20 పెట్రోల్‌ పై ఆరోపణలను కొట్టిపారేసిన కేంద్ర మంత్రులు

ఈ20 పెట్రోల్‌ పై ఆరోపణలను కొట్టిపారేసిన కేంద్ర మంత్రులు
ఇర‌వై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ వాడకంవల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. ఇ-20 పెట్రోల్‌ వల్ల సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని గడ్కరీ సవాల్ చేశారు. ఇథనాల్‌ బ్లెండింగ్‌పై కావాలనే విమర్శకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇ-20 పెట్రోల్‌ వాడకంవల్ల ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఇథనాల్‌ బ్లెండింగ్‌పై జరుగుతోన్న ప్రచారం కేవలం పెయిడ్‌ క్యాంపెయిన్‌ అని ఆయన ఆరోపించారు. అందులో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. దేశం ఏటా ఇంధన దిగుమతుల కోసం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని చెబుతూ ఇథనాల్ తయారు చేయాలనే నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.
 
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదాన్ని తీవ్రంగా ఖండించారు. వాస్తవాల ఆధారంగా కాకుండా, “తప్పుడు వార్తలు, తప్పుడు వ్యాఖ్యానాల” వల్లే ఈ ఆందోళనలు తలెత్తుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ20 పెట్రోల్ వాహనాల ఇంజిన్లను దెబ్బతీస్తుందని, కీటకాలను ఆకర్షిస్తుందని, ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుందని సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ విమర్శలపై స్పందిస్తూ, ఈ20 పెట్రోల్ ఇప్పటికే ఏడాదికి పైగా వాడుకలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని పూరి ప్రశ్నించారు. “రోడ్లపై 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 20 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఈ ఇంధనాన్ని వాడుతున్నాయి. వాహన తయారీదారులు, అలాగే ఈ వాహనాలకు సర్వీసింగ్ చేసేవారు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. మరి అకస్మాత్తుగా ఈ ఆసక్తి ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. 
 
భారతదేశం గత మూడున్నర సంవత్సరాలుగా ఎటువంటి పెద్ద ఆందోళనలు లేకుండా ఈ15 ఇంధనాన్ని ఉపయోగిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ25 ఇంధనానికి మారుతోందన్న ఊహాగానాలపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పూరి స్పష్టం చేశారు. “ఎవరైనా ఈ25ను సూచిస్తుంటే, మేము పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశాము. ఆ పరీక్షలకు సమయం పడుతుంది” అని తెలిపారు. 
 
“నివేదికలు అందిన తర్వాత, మేము వాటిని మూల్యాంకనం చేస్తాము. ఆ తర్వాత, మేము ఆ ఫలితాలను భాగస్వాములు, వాహన తయారీదారులతో చర్చిస్తాము. భవిష్యత్తులో తీసుకునే ఏ నిర్ణయమైనా శాస్త్రీయ పరీక్షలు, వాహన తయారీదారులతో సంప్రదింపుల ఆధారంగానే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.  ఇథనాల్ కలిపిన ఇంధనం వాహనాల మైలేజీని ప్రభావితం చేస్తుందని, కాలక్రమేణా ఇంజిన్లను దెబ్బతీస్తుందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించిన తర్వాత ఈ20 పెట్రోల్‌పై చర్చ ప్రారంభమైంది. 
 
అయితే, ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ప్రకారం, ఈ20 ఇంధనం కోసం రూపొందించిన వాహనాలు దానిని సురక్షితంగా ఉపయోగించవచ్చని వాహన తయారీదారులు ఇప్పటికే ధృవీకరించారు. ఏదైనా కొత్త ఇంధన మిశ్రమాన్ని ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం వాహన తయారీదారులతో సన్నిహితంగా పనిచేస్తుందని కూడా పూరి నొక్కి చెప్పారు.