రాజకీయం కోసం తలసాని, దానం మతం మార్చుకుంటారా?

రాజకీయం కోసం తలసాని, దానం మతం మార్చుకుంటారా?
“కొంతమంది మసీదులు, చర్చిలు కూలగొడుతున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలి”అని ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడడం పట్ల విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ – ముస్లింలు.. హిందూ- క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
 
పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి గారు, పండరినాథ్ ప్రచార ప్రముఖు పగడాకుల బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన నేతలు హిందువులపై విషయం చిమ్మే పనిలో నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నారాయణగూడ లోని వివిధ క్రైస్తవ సంఘాల సమావేశంలో తలసాని, దానం పాల్గొని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
 
మసీదులు, చర్చిలు ఎక్కడ కూలిపోయాయో మంత్రులు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలు పనంగా పెట్టడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. మంత్రి తలసాని, దానం మాటలు మతమార్పిడిని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు.
 
తెలంగాణలో కోటి మంది క్రైస్తవులు ఏకం కావాలని పిలుపునిచ్చారంటే తెలంగాణలో కోటి మందిని హిందువులను మతం మారుస్తున్నారా? అని పరిషత్ నేతలు ప్రశ్నించారు. వాస్తవానికి తెలంగాణలో క్రైస్తవుల సంఖ్య ఎంత? మరి మంత్రులు మాట్లాడిన సంఖ్య ఎంత? అంటే తెలంగాణ ప్రభుత్వం మతమార్పిడి చర్యను భుజాన వేసుకున్నదా? అని వారు నిలదీశారు.
  
ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది క్రైస్తవులు, రెండు కోట్ల మంది ముస్లింలు ఉంటే హిందువుల సంఖ్య ఎంత? అని వారు మంత్రి తలసానిని ప్రశ్నించారు. 25 శాతం క్రైస్తవులు, 35 శాతం ముస్లింలు ఉంటే మరి హిందువుల జనాభా ఎంత? ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణలో హిందువులు మైనారిటీలుగా మారిపోయారా? మంత్రుల మాటల్లోని సారాంశం ఏంటో హిందూ సమాజం ఆలోచించాలని పరిషత్ నేతలు హెచ్చరించారు.
 
ఒకవేళ తలసాని , దానం చెప్పింది నిజమైతే తెలంగాణలో హిందువుల మనగడ ప్రశ్నార్థకం కాక తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల ప్రలోభాల కోసం మతం మారిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాదిరి తెలంగాణలో హిందువులు మైనారిటీగా మారి చిత్రహింసలకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
హిందువులు ఉన్నంతవరకే ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని, అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాగలుగుతాడని, దానం నాగేందర్ ఎమ్మెల్యే అవుతాడని వారు స్పష్టం చేశారు. ఒకవేళ హిందువుల జనాభా మైనార్టీలో పడితే.. ప్రస్తుతం హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎం ఏవిధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి హిందువులను అణచివేసి అప్పజస్వామిక విజయాన్ని ఖాతాల్లో వేసుకుంటుందో రాష్ట్రమంతా అదే జరుగుతుందని వారు హెచ్చరించారు.
 
 అలా వస్తే తలసాని, దానం నాగేందర్ రాజకీయం కోసం మతం మార్చుకుంటారా లేక హిందువులు గానే ఉంటారా స్పష్టం చేయాలని పరిషత్ నేతలు నిలదీశారు. తలసాని, దానం మాటలను తేలికగా తీసుకోవద్దని, రాబోవు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం మేల్కొనాలని వారు పిలుపునిచ్చారు. హిందూ- ముస్లింలు, హిందూ- క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.