ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,352 ఓట్లు పోలకాగా, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి.
ఇతరులకు 11,496 ఓట్లు, నోటాకు 4,179 ఓట్లు పోలవడం విశేషం. బీఎస్పీ అభ్యర్థి ఓబులేష్‌కు 4,897 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినప్పటికీ ఆశించిన మెజారిటీ సాధించలేకపోయింది. లక్ష మెజారిటీ కోసం మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలంతా ఆత్మకూరులోనే మకాం వేసి మరీ ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ లక్ష మెజారిటీ ఆశలపై నీళ్లు చల్లింది. ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ చూపించి ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటి చెప్పాలనిచేసిన ప్రయత్నం ఫలించలేదు.
పోలింగ్ ముగిసే సమయానికి 64.17 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 82 శాతం పోలింగ్ జరిగింది. అంటే 18 శాతం పోలింగ్ తగ్గడంతో లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యం కాలేదు.

More Stories
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు
ఎస్ఐఆర్ లో నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి