ఏపీలో పెద్ద మొత్తంలో లెక్క తేలని కేంద్ర నిధులు

కేంద్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన నిధులతో పాటు, రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన నిధులు పెద్ద మొత్తంలో లెక్క తేలడం లేదు. దీంతో ఈ విషయమై ఎక్కౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఖాతాలను పరిశీలిస్తోంది.

విశ్వసనీయ సమా చారం ప్రకారం ఈ మొత్తం రూ 18,644 కోట్లకు పైనే ఉంది. ఇంత పెద్ద మొత్తానికి సంబంధించి కనీస లెక్కలు లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసిన ఎజి కార్యాలయం ఆ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలు లభించేంత వరకూ సస్పెన్స్‌ ఖాతాలో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎజి కార్యాలయం నుండి రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ అందింది.

కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ గ్రాంట్ల రూపంలో వస్తున్న నిధులతో పాటు, రాష్ట్ర సొంత వనరుల ఆదాయాన్ని పిడి ఖాతాలకు మళ్లించి, అక్కడి నుంచి ఆ నిధులను ఇతర అవసరాలకు వ్యయం చేయడం కొంత కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వార్షికాంతంలో  తేలాల్సిన లెక్కల కోసం పూర్తి వివరాలను సమర్పించక పోవడం వల్ల ఎజి కార్యాలయ అధికారులు పూర్తి స్థాయి గణాంకాలను సిద్ధం చేయలేకపోతున్నారు.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పిరచిన లెక్కల్లో రూ 18,644 కోట్లు తక్కువగా గుర్తించారు. దీనిని మైనస్‌ ఫిగర్స్‌గా ఎజి అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం అంతా రెవెన్యూ పద్దుల్లోనే ఉన్నట్లు గుర్తించారని సమాచారం.

ఈ మొత్తంలో రూ. 3,541 కోట్లు ఎంఎస్‌ఎస్‌ పథకాలకు సంబంధించి ఉండగా, రూ3,562 కోట్లు రాష్ట్ర అభివృద్ధి పథాకలకు కేంద్రం ఇచ్చే సాయం నిధులు ఉన్నట్లు తేలింది. మరో రూ 7,758 కోట్లు సొంత పన్నుల ఆదాయమని సమాచారం.

వార్షికాంతంలో ఖాతాలను ముగించే ముందు మైనన్స్‌ బాలెన్సెస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, అందువల్ల ఆ మొత్తాలకు సంబంధించి పూర్తి వివరాలు అందచేసి వాటికి సంబంధించిన ఖాతాలకు బదలాయించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కాగ్‌ ప్రకటించింది కేవలం ప్రాథమిక లెక్కలు మాత్రమేనని ప్రభుత్వం చెబుతున్నది.