స్కూల్ ముఖం చూడ‌ని ఓ ముల్లా ఆఫ్ఘన్ విద్యామంత్రి

ప్రస్తుతం పిహెచ్‌డిలు, మాస్టర్స్‌ డిగ్రీలకు విలువ లేదని తాలిబన్‌ విద్యాశాఖ మంత్రి షేక్‌ మౌల్వీ నూరుల్లా మునీర్‌ పేర్కొనడం ద్వారా తమ పాలన ఎంత దారుణంగా ఉండబోతుందో సంకేతం ఇచ్చారు.  ఆఫ్ఘన్  ప్రజలు, యావత్‌ ప్రపంచం భయపడిన విధంగానే తాలిబన్‌లు ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

ఎప్పుడూ స్కూల్ ముఖం కూడా చూడ‌ని ఓ ముల్లా ఇప్పుడు అక్క‌డ విద్యాశాఖ మంత్రి అయ్యారు. షేక్ మౌల్వీ నూరుల్లా మునీర్ అనే ఆ మంత్రి ప‌ద‌విలోకి వ‌చ్చీ రాగానే.. ఈ పీహెచ్‌డీలు, మాస్ట‌ర్ డిగ్రీలు ఎందుకూ ప‌నికి రావ‌ని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ముల్లాల‌కు ఆ డిగ్రీలేమైనా ఉన్నాయా? అయినా వాళ్లే అంద‌రి కంటే గొప్ప‌వాళ్లు అని నూరుల్లా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏ పీహెచ్‌డీ డిగ్రీకి, మాస్ట‌ర్ డిగ్రీకి విలువ లేదు. ముల్లాలు, తాలిబ‌న్ లీడ‌ర్ల‌కు ఈ డిగ్రీలు కాదు క‌దా క‌నీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదు. కానీ వాళ్లే ఇప్పుడు గొప్ప‌వాళ్లు అని స్పష్టం చేశారు. 

తాలిబన్‌ విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మునీర్‌ తాలిబన్‌లు ప్రకటించిన 33 మంది కేబినెట్‌ సభ్యుల్లో ఒకరు. 

తాలిబన్ ప్రభుత్వం ప్రపంచ భద్రతకే ముప్పు 

కాగా, అఫ్గానిస్థాన్‌లో మంగళవారం ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వం చట్టబద్ధమైంది కాదని ఆ దేశ జాతీయ ప్రతిఘటన దళం (ఎన్‌ఆర్‌ఎఫ్‌) ఆరోపించింది. తాలిబన్ల ప్రభుత్వానికి సమాంతరంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  ప్రకటించింది. రాజకీయ నాయకులతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. 
 
 ‘ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఎన్‌ఆర్‌ఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్న అహ్మద్‌ మసూద్‌ ఓ  ప్రకటనలో తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వం అఫ్గానిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి, భద్రతకు ముప్పు అని ఆయన హెచ్చరించారు.  ఐరాస, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం, యూరోపియన్‌ యూనియన్‌, సార్క్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు తాలిబన్లకు సహకరించవద్దని కోరారు.
 అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్‌ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్‌ హక్కానీ మామ ఖలీల్‌ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్‌ కమిటీ(తాలిబన్‌ శాంక్షన్స్‌ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది.