మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరపాలి 

* సీఎం చంద్రబాబుకు ఎంపీ లింగమనేని రమేశ్ లేఖ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అక్టోబర్ 7న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారికంగా ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత 2014 నుంచి దేశ ప్రధానమంత్రిగా సమర్థవంతమైన, జనరంజక పాలన అందిస్తూ నిరంతర ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించే అంశాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఎంపీ తెలిపారు. 

 
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆధ్యాత్మిక వైవిధ్యం, సామాజిక సామరస్యాలకు అద్దం పట్టేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ వేడుకలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దేశ ప్రజల శాంతి, సమృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాచలం, అన్నవరం, కాణిపాకం, లేపాక్షి వంటి దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దివ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు.
 
అదేవిధంగా, ఆయా యాజమాన్యాల అంగీకారంతో ప్రభుత్వ సహాయ సహకారాలు పొందుతున్న ప్రసిద్ధ దర్గాలు, చర్చిలు, గురుద్వారాలలో కూడా ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ కోరారు. ఈ క్రమంలో కడప అమీన్ పీర్ దర్గా, నెల్లూరు బారా షహీద్ దర్గా, పెనుకొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా, విజయవాడ గుండాల మేరీ మాత చర్చి, కడప సి.ఎస్.ఐ. కేథడ్రల్ చర్చి, ఏలూరు హోలీ ఏంజెల్స్ కేథడ్రల్, విశాఖపట్నం, విజయవాడలలోని శ్రీ గురు సింగ్ సభ గురుద్వారాలలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానాన్ని కేవలం సాంప్రదాయ వేడుకలకే పరిమితం చేయకుండా ‘సేవ’ కార్యక్రమాల ద్వారా సామాజిక ప్రయోజనం చేకూర్చాలని లింగమనేని రమేశ్ సూచించారు.  వివిధ మత సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని చాటిచెబుతాయని ఎంపీ పేర్కొన్నారు.  

About The Author